లాభాల పండుగప్ప

Huge Profits With Pandugappa Fish Farming - Sakshi

తీరంలో విస్తరిస్తున్న సాగు ఆసక్తి చూపుతున్న రైతులు 

7 కిలోల చేప ధర రూ.480

భీమవరం అర్బన్‌: పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పండుగప్ప చేప సాగు విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో సాగు అంతంతమాత్రంగా ఉండగా గతనెల నుంచి చేప ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నరసాపురం, కాళ్ల మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు. ఈ చేప సప్ప, ఉప్పు నీటిలోనూ పెరుగుతుంది. ఇటీవల పండుగప్పకు డిమాండ్‌ పెరగడంతో సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.  

ధర ఆశాజనకం
ప్రస్తుతం పండుగప్ప చేపల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప రూ.320, రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే రూ.380, ఐదు నుంచి ఏడు కిలోలలోపు ఉంటే రూ.420, ఏడు కిలోలలు దాటితే రూ.480 చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలో పండిన చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బిహార్‌ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలు వదులుతున్నామని, వీటికి ఆహారంగా చైనా గొరకలు, చిన్న చేపలను వేస్తుంటామని రైతులు అంటున్నారు. బతుకున్న చేపలను మాత్రమే వేటాడటం పండుగప్ప ప్రత్యేకత. చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది.  

చిన్న, సన్నకారు రైతుల మొగ్గు
వనామీ పెంపకంలో వైట్‌ స్పాట్, విబ్రియో, వైరస్‌ వల్ల నష్టాలను చవిచూస్తున్న రైతులకు పండుగొప్ప పెంపకం వరంలా మారింది. ఎకరా, రెండెకరాల్లో వనామీ సాగు చేసిన ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని అంటున్నారు.
 
ఆహారంగా చైనా గొరకలు
పండుచేప బతుకున్న చేపలను మాత్రమే ఆహారం తింటుంది. దీంతో రైతులు స్థానిక చేపల చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. కొంతకాలంగా మేత కొరత రావడంతో కొల్లేరు, మచిలీపట్నం, కైకలూరు  ప్రాంతాల నుంచి లారీలపై డ్రమ్ముల్లో ఆక్సిజన్‌ సాయంతో చైనా గొరకలు, చిన్న చేపలను తీసుకువచ్చి పండుగప్ప చెరువుల్లో వేస్తున్నారు.  

లాభసాటిగా ఉంది
నాకు రెండు మీటర్ల లోతు కలిగిన ఎకరా ఉంది. దానిలో 600 పండుగప్ప చేప పిల్లలు వదిలాను. ఏడాది పాటు చైనా గొరకలు, చిన్న చేపలను రోజుకు 60 కిలోల వరకు మేతగా వేశాను. రూ.3 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. పట్టుబడి అనంతరం ఖర్చులు పోగా మిగిలిన దాంతో అప్పులు తీర్చాను. 
    –దాసరి నారాయణరావు, రైతు, లోసరి

మేత కోసం ఇబ్బందులు 
తీర ప్రాంతాల్లో పండు చేప సాగు చేస్తున్నారు. ఈ చేపలకు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్‌ బాగుంది. వీటికి ఆహారంగా వేసే  చైనా గొరకల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.25కు కొని వీటికి మేతగా వేస్తున్నాం. మేత కోసం ఇబ్బందులు తప్పడం లేదు.  
    – గంధం రమేష్, రైతు, లోసరి  

ఏడాదికి 5 వేల టన్నుల వరకు ఎగుమతి
పండుగప్ప చేప శాస్త్రీయ నామం లేటస్‌ కాల్‌కేర్‌ఫర్‌. ఇది ఉప్పు, సప్ప నీటిలో పెరుగుతుంది. దీనిలో ప్రోటీన్లు, కార్పొహైడ్రేట్లు ఉండటంతో డిమాండ్‌ బాగుంది. ఏడాదికి జిల్లావ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల టన్నుల పండుగప్ప చేపలు ఎగుమతి అవుతున్నాయి.  
– ఎల్‌ఎల్‌ఎన్‌ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి, భీమవరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top