4 వారాల్లోగా లీగల్‌ ఫీజులు చెల్లించాలి | High Court order for government and public sector undertakings | Sakshi
Sakshi News home page

4 వారాల్లోగా లీగల్‌ ఫీజులు చెల్లించాలి

Mar 18 2022 5:27 AM | Updated on Mar 18 2022 3:10 PM

High Court order for government and public sector undertakings - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల తరఫున హైకోర్టు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన న్యాయవాదులకు లీగల్‌ ఫీజులు/గౌరవ వేతనం సకాలంలో  చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్లకు ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజులను 4 వారాల్లో చెల్లించాలని 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఇక నుంచి వారి ఫీజులను బిల్లులు సమర్పించిన 4 వారాల్లో లేదా 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నెల తర్వాత చెల్లించాలని స్పష్టం చేసింది. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో  సేవలందిస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో లీగల్‌ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతంలో మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించిన సీహెచ్‌ వేదవాణి తనకు చెల్లించాల్సిన లీగల్‌ ఫీజులను చెల్లించడంలేదంటూ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఫీజులను చెల్లించాలని అధికారులను ఆదేశించింది. వారు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వేదవాణి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ విచారించారు. విచారణ సందర్భం గా ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్స్‌ సకాలంలో లీగల్‌ ఫీజులు అందక పడుతున్న ఇ బ్బందులు న్యాయమూర్తి దృష్టికి వచ్చాయి. దీంతో తనకున్న విచక్షణాధికారంతో ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతపరిచి ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్స్‌ అందరికీ వర్తించేలా తీర్పునిచ్చారు.

కోర్టుకెక్కే పరిస్థితి తేవద్దు
‘ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిల్స్‌ సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం, ఇతర విభాగాలు బిల్లులను మాత్రం సకాలంలో చెల్లించడంలేదు. వారూ కుటుంబాల సంక్షేమాన్ని చూసుకోవాలి. ఓ కార్యాలయాన్ని, గ్రంథాలయాన్ని, సహచరులను, సిబ్బందిని నిర్వహించాలి. సకాలంలో లీగల్‌ ఫీజులు చెల్లించకపోతే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజు కోసం హైకోర్టులో పిటిషన్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేసే పరిస్థితి వారికి తీసుకురావద్దు. రాజకీయ కారణాలతో కూడా ఫీజుల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం జరుగుతోందన్న ఆరోపణ ఉంది.

ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారి ఫీజులు ఆపుతున్నారన్న ఆరోపణ నిజమైతే అది సమంజసం కాదు. వారు సేవలందించింది రాష్ట్రానికే తప్ప వ్యక్తులకు కాదు. పాలకులు వస్తూ పోతూ ఉంటారు. రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది. సకాలంలో ఫీజులు పొందే హక్కు అడ్వొకేట్‌ జనరల్,  ప్రభుత్వ న్యాయవాది, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సహా అందరికీ ఉంది’ అని జస్టిస్‌ దేవానంద్‌ తన తీర్పులో స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement