10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు | Heavy Rains In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు

Oct 11 2022 4:01 AM | Updated on Oct 11 2022 7:20 AM

Heavy Rains In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్‌లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం
ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. 

కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ 
భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్‌లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్‌లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు.

పెన్నా బేసిన్‌లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి.

నైరుతి మురిసింది.. 
ఈ నైరుతి సీజన్‌లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్‌ ఒకటి నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement