
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని వసతులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్లాట్లకు తొలిరోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆన్‌లైన్ బుకింగ్ కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెబ్‌సైట్ ప్రారంభించిన కొద్దిసేపటికే దరఖాస్తులు వచ్చాయని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వీపనగండ్ల రాముడు తెలిపారు. తొలివిడత ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఔట్లలో 150, 200, 240 చదరపు గజాల్లో 3,894 ప్లాట్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం సాయంత్రానికి 643 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడంతోపాటు మొదటి విడతగా 10% ఫీజును చెల్లించారు. మరో 97 మంది మొత్తం ప్లాట్ ధరను ఆన్‌లైన్‌లో చెల్లించి 5 శాతం రాయితీ పొందారు. నవులూరు లేఔట్‌లో 200, 240 చ.గజాల్లో 538 ప్లాట్లను అందుబాటులో ఉంచగా.. మొదటిరోజు 210 మంది ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించారు. 17 మంది మొత్తం ప్లాట్ ధర చెల్లించారు.
భరోసాగా ముందుకొస్తున్నారు
సంక్రాంతి సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చాం. మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో లాభాపేక్ష లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. జగనన్న టౌన్‌షిప్స్‌లో ప్రతీ లేఅవుట్ నిబంధనల మేరకు, క్లియర్ టైటిల్‌తో ఉంటుంది. ప్రభుత్వమే ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. భరోసాగా ముందుకొస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక టౌన్‌షిప్ ఉండాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ చేపడతాం. ప్రజలకు మంచి జరుగుతుంటే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
– బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి