సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా? | Give a comprehensive report on the Welfare hostels | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా?

Jan 9 2025 5:31 AM | Updated on Jan 9 2025 5:31 AM

Give a comprehensive report on the Welfare hostels

హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేయండి

జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టళ్ల(డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు)పై ఇంత నిర్లక్ష్యమా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పిల్లలెందుకు నేలపై నిద్రిస్తున్నారని నిల దీసింది. 

సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంత నిధులు కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తదితర వివ రాలను గణాంకాలతో సహా తమ ముందుంచాలని సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు స్పష్టం చేసింది. 

తదుపరి విచారణకు సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆన్‌లైన్‌లో హాజరవ్వాలని తేల్చిచెప్పింది. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఐదు సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి.. నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. 

విద్యార్థులతో సంభాషించి వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీ­లించాలని.. పౌష్టికాహారం, తాగునీరు, దుప్పట్లు, దోమ తెరలు వంటి కనీస అవసరాలు తీరుతు­న్నా­యో, లేదో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తదు­పరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పిల్లలకు.. కులాలతో ఏం సంబంధం?
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మార్గ­దర్శకాల ప్రకారం సంక్షేమ హాస్టళ్లలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. కానీ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఆ పరిస్థితులు లేవంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశా­రు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది అరుణ్‌ శౌరి వాదనలు వినిపిస్తూ.. సంక్షేమ హాస్టళ్ల­లో తగినన్ని బాత్రూమ్‌లు లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధర్మాసనం స్పంది స్తూ.. దీనిపై మీ వైఖరి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపులు పెంచామని చెప్పారు. అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామని.. ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 1:7 నిష్పత్తిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. 

ఈ విషయాలను కౌంటర్‌లో పేర్కొన్నామని ఆ­మె తెలిపారు. కాగా, ఆ కౌంటర్‌లో హాస్టళ్లలో చ­దు­వుతున్న పిల్లల కులాలను పొందుపరచడాన్ని ధర్మా­సనం గమనించింది. పిల్లలకు కులాలతో ఏం సంబంధమని.. పిల్లలు పిల్లలేనని ధర్మాసనం వ్యా ఖ్యా నించింది. ప్రభుత్వ కౌంటర్‌ సాదాసీదాగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పూర్తి వివరా లతో నివేదికను కోర్టు ముందుంచుతామని ప్రణతి చెప్పారు.

ఇంత తక్కువ నిధులతో నిర్వహణ ఎలా సాధ్యం?
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభు­త్వం నిధులిస్తుంటే.. విద్యార్థులు ఎందు­కు నేలపై నిద్రపోతారని ప్రశ్నించింది. తగిన­న్ని మరుగుదొడ్లు, బెడ్‌లు, బెడ్‌షీట్లు, పౌష్టికాహా­రం తదితరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దోమ తెరలు అందించాలని ప్రభుత్వా­నికి గుర్తు చేసింది. 

ఈ ఆర్థిక సంవత్సరానికి సంక్షేమ హాస్టళ్ల కోసం రూ.143 కోట్లే కేటా­యిం­చడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తంతో హాస్టళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. భావిభారత పౌరుల కోసం నామామాత్రంగా నిధులు కేటాయిస్తే ఎలా? అంటూ నిలదీసింది. 90,148 మంది విద్యార్థులకు ఇంత తక్కువ మొత్తం ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. 

ఇప్పటి వరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? తదిత­ర వివరాలను తమ ముందుంచాలని అధికారు­లను ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక, జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు అందించే నివేది­కలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వు­లు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement