రంగమేదైనా మహిళలే రాణిస్తున్నారు..

Gender Equality And Womens Empowerment - Sakshi

చిత్తూరు: వంటింటి నుంచి మొదలైన అతివ అడుగులు అంతరిక్షాన్ని స్పృశిస్తున్నాయి. సాగరం కన్నా లోతైన ఆమె మదిలో పుడుతున్న ఆలోచనలు ప్రపంచ దిశను మార్చేస్తున్నాయి. ఇంటా బయట ఆమె తల్లిగా.. చెల్లిగా.. భార్యగా.. కోడలిగా.. ఎలాంటి బాధ్యతనైనా నిర్వర్తించడంలో ఆమె నిరుపమాన ప్రేమమూర్తి. కలెక్టర్‌.. డాక్టర్‌..డ్రైవర్‌.. రచయిత.. సమాజసేవకురాలు.. రాజకీయనేత.. రంగం ఏదైనా ఇంతింతై రాణించగల సత్తా ఆమె సొంతం. తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తూ, విభిన్న రంగాల్లో విజయగీతిక ఆలపిస్తున్న మహిళల గాధలు మహిళాదినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.

పల్లె నుంచి ఆర్థిక రాజధానికి..

ఈమె పేరు ఉషారాణి. పెద్దతిప్పసముంద్రం మండలంలోని మారుమూలపల్లెలో పుట్టింది. ప్రభుత్వ పాఠశాలల చదువుకుంది. అయితేనేం.. దేశ ఆర్థిక రాజధాని మంబైలోని ఎస్‌బీఐ పధాన కార్యాలయంలో  డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్థానం విద్యారి్థనులకు స్ఫూర్తిదాయకం.  బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన కొటికె మీనాక్షమ్మ, పట్టాభి రామచంద్రారావ్‌ దంపతులకు ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్న కుమార్తె ఉషారాణి  స్వగ్రామం బడికాయలపల్లె నుంచి మదనపల్లెకు మకాం మారింది. ఏడో తరగతి వరకు మదనపల్లె మున్సిపల్‌ స్కూల్, పదో తరగతి ప్రభుత్వ జీఆర్టీ స్కూల్, ఇంటర్, డిగ్రీ  బీటీ కాలేజీలో చదివారు. అనంతపురం ఎస్‌కే. యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. మదనపల్లెలో ఏడేళ్లు లా ప్రాక్టీస్‌ చేశారు. 1995లో ఎస్‌బీలో లా ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2018 వరకు వరంగల్, హైదరాబాద్‌ బ్రాంచ్‌ల్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్, చీఫ్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2019 నుంచి ముంబయిలోని ఎస్బీఐ కార్పొరేట్‌ సెంటర్‌లో డీజీఎంగా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లా చెన్నుపల్లెకు చెందిన మురళీమోహన్‌తో ఉషారాణికి వివాహం జరిగింది. భర్త హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది. ఒక్కకే కుమార్తె యశస్విని ఢిల్లీ వర్సిటీలో ఎంఎస్‌సీ సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది.   – పెద్దతిప్పసముద్రం

మహిళలే పాలకులు 

మదనపల్లె : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం. ఈ మాట మున్సిపల్‌ పాలకవర్గంలో సార్థకమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవ కానుకగా వారికే అధిక సీట్లు కేటాయింది. దీంతో మున్సిపాలిటీలో 58 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. సుదీర్ఘకాల యానంలో ఏడుగురు పురుషులే ఇప్పటి వరకు చైర్మన్లుగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ప్రాధాన్యం వల్ల తొలిసారి మహిళ చైర్‌పర్సన్‌ పాలన సాగించనున్నారు. పట్టణంలో 35 వార్డుల్లో మహిళలు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 9వార్డుల్లో పోటీలో ఉన్నారు. దీంతో మహిళల సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top