సవాళ్లలోనూ సమర్థంగా 'సేవలు' | Sakshi
Sakshi News home page

సవాళ్లలోనూ సమర్థంగా 'సేవలు'

Published Thu, Dec 24 2020 4:05 AM

Gautam Sawang explaining annual crime report at media conference - Sakshi

సాక్షి, అమరావతి: మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎదురైన అనేక కొత్త సవాళ్లను అధిగమించి ప్రజలకు సమర్థమైన సేవలు అందించామని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ వార్షిక నేర నివేదిక–2020ను వెల్లడించారు. కరోనా సమయంలో పోలీస్‌ శాఖ గతంలో చూడని అనేక కొత్త సవాళ్లు ఎదుర్కొందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని, వివిధ శాఖలతో కలిసి పోలీస్‌ సిబ్బంది కరోనా వారియర్స్‌గా ప్రజలకు సేవలందించారని చెప్పారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పోలీసుల్లో 14 వేలమంది కరోనా బారిన పడ్డారని, 109 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రధాన నేరాలు 2019 కంటే 2020లో 15 శాతం తగ్గినట్లు చెప్పారు. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులతోపాటు బలహీనవర్గాలకు రక్షణ కల్పించడంలో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

మోదీ ప్రశంసలు,కేంద్ర హోంశాఖ అభినందనలు 
ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ చేపట్టిన అనేక చర్యలకు జాతీయ గుర్తింపు లభించిందని చెప్పారు. దిశ కేసుల దర్యాప్తు కోసం ఉద్దేశించిన ‘ఇంటిగ్రేటెడ్‌ క్రైమ్‌ స్కాన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్‌’ పనితీరును పరిశీలించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారన్నారు. ఇదే తరహా వెహికల్స్‌ను దేశ వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్‌ డివిజన్‌కు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారన్నారు. ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసిజెఎస్‌) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కిందని, రూల్‌ ఆఫ్‌ లా అమలులో కేంద్ర హోంశాఖ అభినందించిందని చెప్పారు. పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలు చేస్తున్న మన రాష్ట్రాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. జాతీయస్థాయిలో దిశ, ఏపీ పోలీస్‌ యాప్‌లకు బంగారు పతకం వచ్చిందన్నారు. టెక్నాలజీ వినియోగం, సమర్థమైన సేవల కారణంగా గడిచిన 11 నెలలో 108 జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు. 

న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రస్తుతానికి బ్యాన్‌ లేదు
కొత్త సంవత్సర వేడుకలపై ఇప్పటివరకు ఎటువంటి ఆంక్షలు, బ్యాన్‌ విధించలేదని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోవిడ్‌ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు. పోలీసులను కోర్టు తప్పుబడుతోందంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కోర్టు వ్యాఖ్యల పట్ల స్పందించడం సరికాదని, కోర్టు వ్యాఖ్యలు చేసిందేగానీ తీర్పులో పేర్కొనలేదని డీజీపీ చెప్పారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, హోంగార్డ్స్‌ డీజీ హరీష్‌కుమార్‌గుప్త, పోలీస్‌ వెల్ఫేర్‌ ఏడీజీ శ్రీధర్‌రావు, ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌బ్రిజ్‌లాల్, ఎపీఎస్‌పీ బెటాలియన్స్‌ ఐజీ శంఖబ్రత బాగ్చీ, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పోలీస్‌ సాంకేతిక విభాగం చీఫ్‌ పాలరాజు తదితరులు పాల్గొన్నారు.

379 కేసుల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీటు దాఖలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మహిళల భద్రతకు అనేక కార్యక్రమాలు చేపట్టారని, దీన్లో భాగంగానే దిశ బిల్లు తెచ్చారని గుర్తుచేశారు. దిశ బిల్లు స్ఫూర్తితో గడిచిన ఏడునెలల్లో 379 కేసుల్లో ఏడురోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు వేసినట్లు చెప్పారు. సైబర్‌ మిత్ర, మహిళా మిత్ర, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల ద్వారా మహిళల రక్షణకు చర్యలు చేపట్టామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 25,298 మంది బాలలను సంరక్షించినట్లు తెలిపారు. స్పందన ఫిర్యాదుల్లో 52 శాతం మహిళలవే ఉండటం వారి చైతన్యానికి అద్దంపడుతోందన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఆధ్వర్యంలో అక్రమ మద్యం, అక్రమంగా ఇసుక తరలింపు, గంజాయి, గుట్కా, గ్యాంబ్లింగ్‌పై విస్తృతంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 151 మంది సీఐలకు, డీఎస్పీలకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.  

Advertisement
Advertisement