కడప: కూటమి ప్రభుత్వం పాలన పారిశ్రామిక రంగానికి ఒక శాపంగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. పరిశ్రమల పట్ల జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారన్నారు. కార్మికులను లోపలకు వెళ్ళనివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని, ఆ కంపెనీలో అన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని ఇబ్బందిపెడుతున్నారన్నారు. ఈ తరహా వైఖరి వల్ల ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. వీళ్ల దౌర్జన్యాలకు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.
‘షాడో ముఖ్యమంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. వాస్తవంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్న పరిశ్రమలను పారద్రోలుతున్నారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారు. క్వారీ ముడిసరుకు రాకుండా గూండాలను పెట్టీ అడ్డుకుంటున్నారు. చివరికి ఆ కంపెనీ ఉత్పత్తి చేసే సిమెంట్ టన్నుకి కమిషన్ డిమాండ్ చేయడం దారుణం. మీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టుకుంటేనే పరిశ్రమలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలోనే ఇదే పరిశ్రమను నెల రోజుల పాటు మూతవేయించారు. అయినా జిల్లా యంత్రాంగం స్పందించలేదు..గతంలో ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనాంలేదు. మన ముఖ్యమంత్రి తప్పు చేస్తున్న వారిని దండించకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం చేసి కాంట్రాక్టులు ఇప్పించే పరిస్థితి
ఈ తీరు చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నాలుగు రోజులుగా ఆ పరిశ్రమను నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ఆదినారాయణరెడ్డికి సహకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలిసే పరిశ్రమపై గూండాగిరి జరుగుతోందని అనుమానం ఉంది. ఎంతో మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.
కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్తుంటే పోలీసులే అడ్డుకుంటున్న తీరు దారుణం. కార్మికులు ఉండే గ్రామాల్లోకి వెళ్ళి ఆ పరిశ్రమకు పనికి వెళ్లొద్దని బెదిరిస్తున్నారు. ఇలానే వదిలేస్తే అన్ని పరిశ్రమలకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు సీఎం రమేష్, అది వర్గీయుల ఆధిపత్య పోరు అదానీ కంపెనీ కూడా తాకింది. లోకేష్ రచించిన రెడ్ బుక్ పాలన పరిశ్రమలకు కూడా వర్తింపు చేస్తున్నారు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ కోసం అది, జేసీ వర్గీయులు కొట్లాటకు దిగితే చంద్రబాబు రాజీ చేశారు. తన అనుయాయులకు పరిశ్రమల నుంచి దోచిపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక కడప లాంటి ప్రాంతానికి పరిశ్రమలు ఎలా వస్తాయి..?, చంద్రబాబును కలిసి వచ్చిన మరుసటి రోజే ఈ పరిశ్రమపై ఆది దాడికి దిగాడంటే ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలన్నీ మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది’అని హెచ్చరించారు.


