
దేశం, రాష్ట్రంలోనూ చిరుధాన్యాల వాడకం అధికమే
పట్టణాల్లో కంటే పల్లెల్లోనే వినియోగం అధికం
తృణధాన్యాల వినియోగంలో జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ టాప్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణం 14.. పట్టణాల్లో 13వస్థానం
గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో కేరళ ఫస్ట్
జాతీయ పోషకాహార నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: అటు దేశవ్యాప్తంగానూ, ఇటు రాష్ట్రంలోనూ తీసుకుంటున్న ఆహార సమూహంలో తృణ ధాన్యాల వాటానే అధికం. అలాగే పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల ఆహార సమూహంలోనూ తృణ ధాన్యాలదే పెద్దపీట. దేశంతోపాటు, ప్రధాన రాష్ట్రాల్లో తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం లాంటి ఐదు ఆహార సమూహాల్లో ఏమేర ప్రోటీన్లు తీసుకుంటున్నారు అనే అంశంపై విభజిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వినియోగంలో జార్ఖండ్ తొలి స్థానంలో నిలవగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే 37.2 శాతం వినియోగంతో 14వస్థానంలో ఉంది. అటు పట్టణ ప్రాంతాల్లో తృణ ధాన్యాల వాడకంలోనూ ఈ రాష్ట్రాలే ముందువరుసలో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వరుసగా నిలిచాయి.
ఇక ఏపీ లో చూస్తే 34.6 శాతంతో 13 వస్థానంలో ఉంది. ఆహారంలో అత్యధికంగా గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో చూస్తే కేరళ అగ్రగామిగా ఉంది. ఈ రాష్ట్రంలో తృణ ధాన్యాల వినియోగం వాటా మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ. గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో రాజస్థాన్ చిట్ట చివర ఉంది. ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం ఉండగా, పట్టణాల్లో 2.5 గా నమోదైంది.

రాష్ట్రంలో పెరిగిన వినియోగం
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..2022–23 కంటే 2023–24లో ఆహారంలో గుడ్లు, చేపలు, మాంసం వాటా పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2022–23లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి వాటా 19.1 శాతం ఉండగా, 2023–24లో 19.3 శాతానికి పెరిగింది. అటు పట్టణాల్లో చూస్తే 2022–23 లో 18 శాతం ఉండగా 2023–24లో 19.1 శాతానికి పెరిగింది.