
సాగర్ టెయిల్ పాండ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ప్రకాశం బ్యారేజీలోకి 4.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
గోదావరిలో వరద ఉధృతి
భద్రాచలం వద్ద 47.4 అడుగులకు చేరిన నీటి మట్టం
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/సత్రశాల/అచ్చంపేట/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి బుధవారం మరింత పెరిగింది. కడలి వైపు నదులు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదులు తుంగభద్ర, భీమా వరదెత్తి ప్రవహిస్తున్నాయి.
తుంగభద్ర డ్యాంలోకి 1.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.21 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద నీటిమట్టం 311.32 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,78,032 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 4,85,397 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,87,037 క్యూసెక్కులు చేరుతుండగా 4,48,761 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,45,187 క్యూసెక్కులు చేరుతుండగా 4,81,102 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,64,064 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,59,786 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపం
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల గోదావరి ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి ఉప నదులు, వంకలు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు వరద నీటి మట్టం 43.2 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
బుధవారం అర్ధరాత్రి దాటాక భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 8,25,477 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 4,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,20,677 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 17 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 15,661 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.