పెద్దబావ వద్దు.. చిన్నబావే ముద్దు | Flexi War Between Bhuma Akhila Priya | Sakshi
Sakshi News home page

పెద్దబావ వద్దు.. చిన్నబావే ముద్దు

Jun 10 2025 8:30 AM | Updated on Jun 10 2025 8:30 AM

Flexi War Between Bhuma Akhila Priya

భూమా కుటుంబంలో ‘ఫెక్లీల’ తంటా!

దేవర సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ ఫొటో లేకుండా ఫ్లెక్సీ

జిల్లా నేతల ఫొటోలతో వేయించిన చిన్నాన్న భూమా బ్రహ్మానందరెడ్డి

బావ మంచు మనోజ్‌ ఫొటోతో మరో ఫ్లెక్సీ వేయించిన బావమరిది భూమా సంతోష్‌ 

అధికారులను పురమాయించిన  ఎమ్మెల్యే

ప్రయివేట్‌ కార్యక్రమం కావడంతో చేతెలెత్తేసిన వైనం

తెరపైకి ఇన్‌చార్జి మార్పు వ్యవహారం

మొన్నటి దాక అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించిన అఖిప్రియ చిన్నాన్న కొడుకు భూమా సంతోష్‌రెడ్డి కూడా తన పంథా మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేనిది చిన్నక్క భూమా మౌనికారెడ్డి భర్త మంచుమనోజ్‌ ఫొటోతో ఫ్లెక్సీ వేయించడం భూమా కుటుంబంలో కలకలం రేపుతోంది.

ఆళ్లగడ్డ: నియోజకవర్గ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. దొర్నిపాడు మండలం గోవిందెన్న పెద్దమ్మ దేవర సందర్భంగా భూమా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో ఎమ్మెల్యే అఖిలప్రియ ఫొటో మాత్రమే లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ భూమా కుటుంబంలో అగ్గి రాజేసింది. అయితే ఇందులో జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులందరి ఫొటోలు ఉండటం గమనార్హం. పెద్దమ్మ తల్లి దేవర మొత్తం భూమా కుటుంబం ఆధ్వర్యంలోనే జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో జరుగుతున్న దేవర సందర్భంగా ఎమ్మెల్యే అఖలప్రియ చిన్నాన్న, మాజీ ఎంపీపీ భూమా బ్రహ్మానందరెడ్డి ఓ ఫ్లెక్సీ వేయించారు. 

ఇందులో కూతురు అఖిలప్రియ ఫొటో లేకుండా ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రులు ఫరూక్‌, బిసి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరుచరితతో పాటు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే అఖిలకు మింగుడు పడలేదని తెలుస్తోంది. ఈ విషయమై ప్రొటోకాల్‌ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అక్కడకు వెళ్లిన పోలీస్‌, పంచాయతీ అధికారులు అందులో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండటంతో తమకెందుకు వచ్చిన గొడవని మిన్నకుండిపోయారు. అది ప్రయివేట్‌ ప్రోగ్రాం కావడంతో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలని ఎమ్మెల్యేకు చెప్పి చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

టీడీపీ ఇన్‌చార్జి మార్పు కోసమేననే చర్చ
ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌పై వరుస ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సీరియస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వేరొకరిని నియమించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సీపీ శ్రీనివాసరెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఇదిలాఉంటే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి.. అఖిలప్రియ చెల్లెలు, మంచు మనోజ్‌ భార్య భూమా మౌనికారెడ్డిలలో ఎవరో ఒకరికి కూడా ఇన్‌చార్జి పదవి కట్టబెట్టవచ్చని కూడా టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement