కష్టకాలంలో రైతుకు ఆర్థిక భరోసా.. నేడే పెట్టుబడి సాయం

Financial assurance to the farmer in difficult times - Sakshi

గతేడాది కంటే 79,472 మందికి అదనంగా ప్రయోజనం

గతేడాదితో పోల్చితే అదనంగా 32,083 మంది కౌలుదారులకు లబ్ధి

కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్‌ ప్రారంభం కావడానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద గురువారం తొలి విడత సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్‌ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 

ఈ ఏడాది 79,472 కుటుంబాలకు అదనంగా ప్రయోజనం
ఈ ఏడాది అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,52,263 మంది ఉండగా (యానాం రైతులతో కలిపి), భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చెందిన 865 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 79,472 రైతు కుటుంబాలు అదనంగా లబ్ధి పొందనున్నాయి. ఈ ఏడాది 32,083 మంది కౌలుదారులు కొత్తగా లబ్ధి పొందనున్నారు. 50,52,263 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద తొలి విడతగా రూ.2 వేల చొప్పున కేంద్రం రూ.1010.45 కోట్లు సర్దుబాటు చేస్తుండగా, రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.2,778.74 కోట్లు సాయమందిస్తోంది.

ఇక భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారుల కుటుంబాలకు రూ.7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొలి విడతగా రూ.139.69 కోట్లు సర్దుబాటు చేస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది కౌలుదారులతో సహా అర్హత పొందిన 52,38,517 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్‌ కింద రూ.1010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఏం కిసాన్‌ కింద తొలివిడతగా రూ.3928.88 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత రెండేళ్లలో రూ.13,101 కోట్లు సాయం అందించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,071.80 కోట్లు అందించనుంది. మొత్తంగా మూడేళ్లలో అన్నదాతలకు రూ.20,172.8 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 

మూడు విడతల్లో సాయం
వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7,500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్‌లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top