ఎరువులు పుష్కలం.. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల విక్రయాలు | Sakshi
Sakshi News home page

ఎరువులు పుష్కలం.. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల విక్రయాలు

Published Sat, Aug 20 2022 3:47 AM

Fertilizers are plentiful AP - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ఊపందుకుంది. సాగు లక్ష్యంలో ఇప్పటికే 68 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఈ దశలోనే ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో.. గతంలో ఎన్నడూలేని విధంగా డిమాండ్‌కు మించి ఎరువుల నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచడమే కాకుండా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తోంది. కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నిస్తే సహించే ప్రశ్నేలేదని హెచ్చరించింది. కృత్రిమ కొరతను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. విస్తృత తనిఖీలు చేస్తోంది. ఆర్బీకే లేదా టోల్‌ ఫ్రీ నెం.155251కు ఫోన్‌చేస్తే డీలర్ల భరతం పడతామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

రాష్ట్రంలో 7.70 లక్షల టన్నుల నిల్వలు
ఖరీఫ్‌ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం. రబీలో మిగిలిన ఎరువులు, ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు కేంద్రం కేటాయించిన ఎరువులతో కలిపి మొత్తం 16.24 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. వీటిలో ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 7.70 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3.44 లక్షల టన్నుల యూరియా, 2.83 లక్షల టన్నుల కాంప్లెక్స్, 65,265 టన్నుల డీఏపీ, 40,688 టన్నుల  ఎంఓపీ, 37,268 టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువుల నిల్వలున్నాయి. ఆగస్టు నెలకు కేంద్ర కేటాయింపులు ద్వారా 6.11 లక్షల టన్నులు రావాల్సి ఉంది. మరోవైపు.. ఆర్బీకేల్లో 1.69 లక్షల టన్నులు నిల్వచేయగా, 94,676 టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 74,373 టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

సమృద్ధిగా డీఏపీ ఎరువులు
ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా వినియోగించే డీఏపీ ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి. ఖరీఫ్‌–2021లో 1.26 లక్షల టన్నుల డీఏపీ వినియోగించగా, ప్రస్తుత సీజన్‌కు 2.25 లక్షల టన్నులను కేంద్రం కేటాయించింది. ఇప్పటివరకు 1.90 లక్షల టన్నులను అందుబాటులో ఉంచగా, 1.25 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 65,265 టన్నుల డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో కూడా 36,474 టన్నుల డీఏపీ ఎరువులు అందుబాటులో ఉంచగా, ఇప్పటివరకు 19 వేల టన్నుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 17,465 టన్నులు అందుబాటులో ఉన్నాయి.

కృత్రిమ కొరత సృష్టిస్తే కొరడా
ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డీఏపీ, ఎస్‌ఎస్‌పీ మినహా మిగిలిన ఎరువుల ధరల్లో ఎలాంటి మార్పులేదు. పోషక ఆధారిత రాయితీ, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిసరుకుల ధరల కారణంగా బస్తా డీఏపీకి రూ.150లు, ఎస్‌ఎస్‌పీపై రూ.125లు మేర కంపెనీలు పెంచాయి. వీటి ధరల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమాత్రం ఉండదు. మరోవైపు.. భవిష్యత్‌లో ఎరువుల ధరలు పెరుగుతాయనే ఆలోచనతో కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎరువుల సరఫరా, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రతీ జిల్లాకు ఓ సీనియర్‌ అధికారికి బాధ్యతలను అప్పగించింది. జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటుచేసింది. ఎరువుల దుకాణాలతో పాటు స్టాక్‌ పాయింట్లను విస్తృతంగా తనిఖీచేస్తోంది. 


ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు
ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్‌కు మించి ఎరువులు అందుబాటులో ఉంచాం. ఏ ఒక్కరూ ఎమ్మార్పీకి మించి చెల్లించొద్దు. విధిగా రశీదు తీసుకోండి. ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే సమీప ఆర్బీకే లేదా స్థానిక వ్యవసాయాధికారికి సమాచారమివ్వండి. లేదంటే టోల్‌ ఫ్రీ నెం.155251కు ఫిర్యాదు చేయండి. వారి లైసెన్సులు రద్దుచేయడమే కాక.. క్రిమినల్‌ కేసులూ పెడతాం. ఇక ఎరువుల కొరత, ధరల పెరుగుదలపై దుష్ప్రచారం సరికాదు.
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ
చదవండి: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు

Advertisement
 
Advertisement
 
Advertisement