
కోనసీమ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1.90 లక్షల మెట్రిక్ టన్నులే
పైగా మద్దతు ధరలో ఎడాపెడా కోతలు.. బస్తాకు రూ.220 నుంచి రూ.320 వరకు నష్టం
కళ్లాల్లో ఇంకా 1,96,280.24 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు
రైతులు రోడ్డు ఎక్కుతున్నా చలనంలేని సర్కారు
సాక్షి, అమలాపురం/అయినవిల్లి: రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 45 రోజులవుతున్నా ఇప్పటికీ అరకొరగానే జరుగుతున్నాయి. రైతులు పలుచోట్ల రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందే తప్ప ఆశించిన మేర కొనడంలేదు. దీంతో అన్నదాతల వేదన అరణ్యరోదనగా మారుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,64,854 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరగగా, 5,86,616 మెట్రక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
అంటే.. ఎకరాకు సగటున 47 బస్తాలు (బస్తా 75 కేజీలు). కానీ, తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో 50–60 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలా చూస్తే దిగుబడి కనీసం ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి ఉంటుందని అంచనా. పోనీ అధికారులు లెక్కగట్టిన విధంగా పండిన ధాన్యాన్ని అయినా కొన్నారా అంటే అదీ లేదు.
రోడ్డెక్కుతున్న అన్నదాతలు..
జిల్లాలో ఏర్పాటుచేసిన 334 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం తొలుత అనుమతిచ్చింది. దీంతో ఆయా కేంద్రాల టార్గెట్లను జిల్లా యంత్రాంగం కుదించింది. రైతుల వద్ద సగం ధాన్యం ఉన్నా సరే ఆయా కేంద్రాలలో టార్గెట్లు అయిపోయాయంటూ కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో.. రైతులు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో.. ఇదే అదనుగా వారు సాధారణ రకం బస్తా (75 కేజీలు) మద్దతు ధర రూ.1,720 ఉండగా వారు రూ.1,400, రూ.1,500కు కొనుగోలు చేశారు. బొండాల రకం (ఎంటీయూ–2636, ఒడిశా, టాటా బొండాలు) ఇటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ.. అటు మిల్లర్లు కొనుగోలు చేయలేదు.
ఇది జిల్లా వ్యాప్తంగా రైతుల ఆగ్రహానికి దారితీసింది. మండపేట, రాజోలు, అమలాపురం వంటి ప్రాంతాల్లో పండించిన ధాన్యంతో రైతులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. తాజాగా.. గురువారం అయినవిల్లి మండల రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. ధాన్యం కొనుగోలుపై వైఎస్సార్ïÜపీ పలు సందర్భాల్లో రైతులకు అండగా నిలిచింది. జిల్లా కేంద్రమైన అమలాపురంలో రైతు నిరసన దీక్షలకు దిగింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయినా.. జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగానే సాగుతోంది.
ఇంకా కళ్లాల్లోనే ధాన్యం..
ఇక జిల్లాలో ఇప్పటివరకు (గురువారం) కేవలం 1,90,335.760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఇందులో సాధారణ రకం 1,90,039.480 మెట్రిక్ టన్నులు కాగా.. గ్రేడ్–ఏ రకం 296.280 మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం చూస్తే ఇంకా 1,09,960.52 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.270 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.167 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిల్లర్లు, దళారులు కలిపి మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఉంటారని అంచనా.
అంటే.. మొత్తమ్మీద ఇప్పటివరకు సుమారు 3,90,335.760 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాలు, దళారులు, మిల్లర్లకు చేరింది. వ్యవసాయ శాఖ చెప్పిన దిగుబడి గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నా మరో 1,96,280.24 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉందని అంచనా. మరోవైపు.. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి బస్తాకు రూ.220 నుంచి రూ.320 వరకు రైతులు నష్టపోయారు. పంట పండినా కూడా నష్టాలు చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ధాన్యం ట్రాక్టర్లతో రైతుల నిరసన
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని.. ఆరుగాలం కష్టపడిన పంటను కొనుగోలు చేయడంలేదంటూ అయినవిల్లి రైతులు ధాన్యం ట్రాక్టర్లతో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. మండలానికి చెందిన రైతుల ధాన్యం నాలుగు రోజులుగా కొనుగోలు చేయడంలేదు. దీంతో గురువారం వారు ధాన్యం ట్రాక్టర్లతో నేరుగా ముక్తేశ్వరం సెంటరుకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం.. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ముక్తేశ్వరం సెంటర్‌లోనూ 20 ట్రాక్టర్లతో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధరను అందించిందని గుర్తుచేశారు. అలాగే, రైతులకు రైతుభరోసా అందించి ఆదుకున్నారన్నారు. అనంతరం.. డీఆర్వో రాజకుమారి రైతులతో చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోలు చేయిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఇక రైతుల ఆందోళనకు పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావుతోపాటు పలువురు మద్దతుగా నిలిచారు.