కథా దార్శనికుడు ‘సింగమనేని’ కన్నుమూత 

Famous Writer Singamaneni Narayana Rao No More - Sakshi

శోకసంద్రమైన సాహితీలోకం 

ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం.. కళారత్న 

బిరుదుతో సత్కరించిన ప్రభుత్వం

సాక్షి, అనంతపురం‌:  రాయలసీమ అస్తిత్వ పోరాటాలకు సాహితీ పరిమళాలద్దిన ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ (78) గురువారం కన్నుమూశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

చిన్న వయస్సు నుంచే రచనలు 
సింగమనేని నారాయణ రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లి గ్రామంలో 1943 జూన్‌ 23న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తిరుపతిలోని ప్రాచ్య కళాశాలలో విద్వాన్‌ చదివిన ఆయన.. చిన్నవయసు నుంచే రచనా వ్యాసంగంలో మక్కువ చూపించేవారు. తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు తెలుగు భాషపట్ల ఆసక్తి కలిగించిన సింగమనేని.. 2001లో పదవీ విరమణ చేశారు.  

కథకుడు, నవలా రచయితగా.. 
సింగమనేని ఇప్పటివరకు 43 కథలు రాశారు. 1960లో ‘న్యాయమెక్కడ’ అన్న తొలికథ నుంచి నేటివరకు ఆయన కలం నుంచి అనేక సాహితీ విలువలున్న వ్యాసాలను, కథలను రచించారు. జూదం, సింగమనేని కథలు, అనంతం అనే కథా సంపుటాలను, సీమ కథలు, ఇనుపగజ్జెల తల్లి, తెలుగు కథలు–కథన రీతులు, తెలుగు కథ మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సంభాషణ అనే పేరుతో వ్యాస సంపుటి ఎంతోమందికి స్ఫూర్తినందించింది. అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు నవలలు రాసి మెప్పించారు. 

కళారత్నతో సత్కరించిన సర్కార్‌ 
ఎన్నో అవార్డులు, రివార్డులనందుకున్న ‘సింగమనేని’ని 2017లో ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. అనంతపురం జిల్లా సాహిత్యానికి పెద్ద దిక్కుగా ఉన్న సింగమనేని నారాయణ మరణంతో ఒక శకం ముగిసిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథరెడ్డితోపాటు ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ శాంతినారాయణ తదితరులు సింగమనేనికి కన్నీటి నివాళులర్పించారు. సింగమనేనికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా కనగానిపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top