కోనసీమలో మద్యం నుంచి పిండేస్తున్నారు | Excise pressures for target consumers | Sakshi
Sakshi News home page

కోనసీమలో మద్యం నుంచి పిండేస్తున్నారు

Aug 9 2025 5:16 AM | Updated on Aug 9 2025 5:16 AM

Excise pressures for target consumers

అమలాపురం మండలం సమనసలోని మద్యం దుకాణంలో పరి్మట్‌ రూము

పెద్దలతో సంబంధాలున్న సిండికేట్‌ తిరస్కరణ

టార్గెట్‌ మామూళ్ల కోసం ఎక్సైజ్‌ ఒత్తిళ్లు

దుకాణాలకు తాళాలు వేసిన మద్యం వ్యాపారులు  

రెండువైపులా కూటమి నేతలే! 

సాక్షి, అమలాపురం: అటు మేమే.. ఇటు మేమే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కూటమి నేతలు. ఒకవైపు వాళ్లు చెప్పినట్లుగా మద్యం మామూళ్లు వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ అధికారులను.. మరోవైపు అదే అధికార కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్‌ వ్యాపారులు మేమెందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఒత్తిళ్లకు నిరసనగా కొందరు వ్యాపారులు మద్యం దుకాణాలకు తాళాలు వేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మద్యం షాపుల కేటాయింపు నుంచి బెల్టుషాపులు, పర్మిట్‌ రూము­లు, అనధికార బార్లు.. ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా మద్యం చుట్టూ కూటమి నేతల దోపిడీ సాగుతోంది.

దరఖాస్తుల నుంచే..
కూటమి ప్రభుత్వం తొలి నుంచి మద్యం ప్రియులను దోచుకోవడంపైనే దృష్టి పెట్టింది. షాపుల కేటాయింపులో లాటరీని నమ్ముకుంది. ఆశావహుల వద్ద రూ.2 లక్షల చొప్పున డీడీ తీసుకుంది. కోనసీమ జిల్లాలో తొలివిడతగా 133 మద్యం దుకాణాలకు 3,894 దరఖాస్తులందాయి. వీటిద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.77.88 కోట్లు చేరాయి. కొందరు సిండికేట్‌గా పదుల సంఖ్యలో డీడీలు తీసి దరఖాస్తు చేశారు. ఇటువంటి సిండికేట్లు నాలుగైదు దుకాణాలే పొందాయి. దీంతో వచ్చిన దుకాణాల నుంచే వీలైనంత సొమ్ము పిండాలని మద్యం విచ్చలవిడి అమ్మకాలకు తెరతీశారు. 

షాపుల్లో కన్నా బెల్టు షాపులు, అనుమతి లేని పర్మిట్‌ రూముల్లో మద్యం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 146 మద్యం దుకాణాలున్నాయి. ప్రతి మద్యం దుకాణానికి 15 నుంచి 25 వరకు బెల్ట్‌ షాపులున్నాయి. ప్రతి ఐదు దుకాణాలకు గాను మూడింటిలో అనధికార పర్మిట్‌ రూములు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని పర్మిట్‌ రూములు చిన్నసైజు బార్లను తలపిస్తున్నాయి. కొన్ని దుకాణాల వద్ద బిర్యానీ, ఇతర నాన్‌ వెజ్‌ ఆహారం అమ్ముతున్నారు. 

వీటితోపాటు డ్రింకులు, సోడాలు, సిగరెట్ల వంటి అమ్మకాలకు కూడా అనుమతులిస్తూ మద్యం దుకాణదారులు నాలుగైదు రకాలుగా ఆదాయం పొందుతున్నారు. వీరి సంపాదన అటు ఎక్సైజ్‌ అధికారులకు, ఇటు కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. కూటమి పార్టీలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులకు, వారి ముఖ్య అనుచరులకు మద్యం దుకాణాలుండటంతో ఈ దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. 

కీలక నేతల్లో కొందరికి మద్యం దుకాణాల్లో నేరుగా వాటాలున్నాయి. వాటాలు లేనిచోట్ల దుకాణాల నుంచి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్‌ అధికారులు సైతం ఇదే బాటను ఎంచుకున్నారు. ఎక్సైజ్, పోలీస్, విజిలెన్స్‌.. ఇలా అందరూ ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. 

కూటమి నేతల కనుసన్నల్లోనే..
అమలాపురం పరిధిలో ఓ మద్యం సిండికేటు చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధికి తోడు.. చినబాబుతో సన్నిహిత సంబంధాలున్న టీడీపీ యువనేత భాగస్వామిగా ఉన్న ఈ సిండికేట్‌ మామూళ్లు ఇవ్వడం లేదు. తమకు ఈ స్థాయిలో పరిచయాలుంటే నెలవారీ మామూళ్లు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇదే సమయంలో ఎక్సైజ్‌ శాఖలో కింద నుంచి పై వరకు అదే చినబాబు మామూళ్ల లక్ష్యం పెట్టడంతో వాటిని సాధించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పట్టణ పరిధిలోని దుకాణాలపై ఏదో ఒక రూపంలో ఒత్తిడి తెస్తున్నారు. 

అధికార పార్టీ అండదండలున్నా అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో సిండికేట్‌ ఆధ్వర్యాన దుకాణదారులు ఎదురు తిరిగారు. దుకాణాలకు సోమవారం తాళాలు వేసి, తాళం చెవుల్ని ఏకంగా ఎక్సైజ్‌ సీఐకి ఇచ్చి వచ్చేశారు. ఎక్సైజ్‌ అధికారులకు మామూళ్లు ఇవ్వలేకపోతున్నామంటూ మీడియా ముందు ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు, కీలక నేత ముఖ్య అనుచరుడు కీలకంగా వ్యవహరించారు. పైన టార్గెట్లు పెట్టేది కూటమి నేతలే.. దిగువన ఎదురు తిరిగేది కూటమి నేతలే అంటూ ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement