
సాక్షి, అమరావతి: తన ఆత్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాపాలను కప్పెట్టి.. వాటిని సీఎం వైఎస్ జగన్‌పై రుద్దుతూ విషం చిమ్మడంలో తనకు అలుపేలేదని ఈనాడు రామోజీరావు రోజూ చాటుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య.. విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య 14 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ఆయన డిజైన్ చేసి, పూర్తిచేసి, జాతికి అంకితం చేసిన దాఖలాల్లేవు. పైగా తాను నిర్మించని ప్రాజెక్టుల భద్రత, నిర్వహణను సైతం గాలికొదిలేశారు.
మరోవైపు.. వాటి నిర్వహణ పేరుతో పనులు చేపట్టకుండానే చేపట్టినట్లు చూపి కాంట్రాక్టర్లకు భారీఎత్తున నిధులు దోచిపెట్టి, వారి నుంచి కమీషన్లు దండుకున్నారు. ఆ పాపాల ఫలితంగానే ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు తుప్పుపట్టిపోయి ఈనెల 8న వరద ఉధృతికి దాని అడుగుభాగం కొట్టుకుపోయింది. అలాగే, పులిచింతల ప్రాజెక్టు గేటు.. అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు మట్టికట్టలు కొట్టుకుపోవడానికి.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవినీతి, అసమర్థతేనని అధికారవర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
కానీ, ఈ పాపాన్ని సీఎం వైఎస్ జగన్‌పై రుద్దుతూ ‘కొత్తవి కట్టరు.. ఉన్నవి కొట్టుకుపోతున్నాయ్!’ అంటూ ఆదివారం తన విషపుత్రిక ఈనాడులో రామోజీ అబద్ధాలను రంగరించి చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశాలను ప్రస్తావించకుండా జాగ్రత్తగా అచ్చేశారు. ఇందులో వీసమెత్తు నిజం లేకపోగా.. ప్రతి అక్షరంలో జగన్‌పై తనకున్న అసూయ, విద్వేషాన్ని రామోజీ ప్రదర్శించారు.
నిపుణుల కమిటీ నివేదికలు బుట్టదాఖలు..
2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద రూ.లక్ష కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఒకేసారి గుండ్లకమ్మ, పులిచింతల, పోలవరం సహా 83 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును 2008 నాటికే పూర్తిచేసి జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తిచేస్తూ జాతికి అంకితం చేస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లు, గాలేరు–నగరిలో భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఇప్పటికే జాతికి అంకితం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.
2015 నుంచి 2019 వరకూ ఏటా నిపుణులతో కూడిన డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ గుండ్లకమ్మ ప్రాజెక్టును తనిఖీచేసి.. ఇది సముద్రతీరానికి సమీపంలో ఉండటంవల్ల నీటి స్వభావంలో మార్పులతో గేట్లు, గడ్డర్లు తుప్పుపట్టాయని.. కొత్త గడ్డర్లను ఏర్పాటుచేసి, గేట్లకు మరమ్మతులు చేయాలని ఏటా నివేదిక ఇస్తూ వచ్చింది. బాబు వాటిని బుట్టదాఖలు చేశారు. కానీ, ఆ పనులన్నీ చేసినట్లు చూపి రూ.5.15 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. అప్పట్లో ఆ పనులను చేసి ఉంటే.. ఈ ప్రాజెక్టు గేట్లు ఇప్పుడు కొట్టుకుపోయేవి కాదు.
చంద్రబాబు నిర్వాకంవల్లే గతేడాది ఆగస్టు 31న గుండ్లకమ్మ మూడు.. ఈనెల 8న రెండో గేటు కొట్టుకుపోయాయి. ఈ రెండు సందర్భాల్లోనూ యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాగ్ గేట్లను ఏర్పాటుచేసి, ప్రాజెక్టులో నీటినిల్వ చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలను జగన్ పరిరక్షించారు. అలాగే, రూ.9.14 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు టెండర్లు ఖరారు చేసి యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తిచేయనున్నారు.
‘పులిచింతల’లోనూ అదే నిర్లక్ష్యం..
అంతేకాక.. పులిచింతల గేట్ల అమరిక కూడా సక్రమంగాలేదని.. వాటిని సరిదిద్దాకే కాంట్రాక్టరుకు తుది బిల్లు చెల్లించాలని 2015లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే.. చంద్రబాబు తుది బిల్లుతోపాటు బ్యాంకు గ్యారంటీలను చెల్లించి, ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా రూ.199 కోట్లు దోచిపెట్టి కమీషన్లు దండుకున్నారు. ఈ పాపం ఫలితంగానే 2021, ఆగస్టు 5న పులిచింతల 16వ గేటు కొట్టుకుపోయింది. అప్పట్లో యుద్ధప్రాతిపదికన స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేసి.. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వచేసి తద్వారా సీఎం జగన్ రైతుల ప్రయోజనాలను కాపాడారు.
ఇటీవలే కొత్త గేటును సైతం బిగించారు. ఇక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయకుండానే ప్రధాన(ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను రూ.400 కోట్లతో చంద్రబాబు నిర్మించారు. కాఫర్ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాల గుండా 2020లో గోదావరి అధిక ఉధృతితో ప్రవహించడంవల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీనికి రామోజీ ఏం సమాధానం చెబుతారో!?
ప్రాజెక్టుల విధ్వంసకుడు చంద్రబాబే..
అధికారంలో ఉన్న 14 ఏళ్లు చంద్రబాబు ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతను గాలికొదిలేశారు.
♦ శ్రీశైలం ప్రాజెక్టుకు 1998లో 7.36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. దాన్ని సక్రమంగా నియంత్రించేలా అధికారులకు అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలివ్వడంలో విఫలమవడంతో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రాన్ని వరద ముంచెత్తి, అపార నష్టాన్ని చేకూర్చింది.
♦ అనంతపురం జిల్లాలో వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) గేట్లు తుప్పుపట్టాయని, వాటికి మరమ్మతులు చేయాలని 1997 నుంచి 2001 వరకూ అనేకసార్లు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని చంద్రబాబు తుంగలోకి తొక్కడంతో 2001లో వేదవతికి వచ్చిన వరద ఉధృతికి బీటీపీ గేట్లు కొట్టుకుపోయాయి.
♦ అలాగే, చెయ్యేరుకు ఆకస్మికంగా వరదలు వస్తాయని.. ఆ ప్రాజెక్టు గేట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. అధునాతన జనరేటర్ ఏర్పాటుచేయాలని 1999 నుంచి 2003 వరకూ అనేకసార్లు నిపుణుల కమిటీ నివేదికలిచ్చింది. వాటినీ చంద్రబాబు తుంగలో తొక్కేశారు. దాంతో చెయ్యేరుకు 2003లో వచ్చిన వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.
♦ 2018లో చిత్తూరు జిల్లాలో వరదలకు కాళంగి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా బాబులో చలనంలేదు. ప్రాజెక్టుల విధ్వంసకుడు ఎవరో రామోజీ ఇప్పుడు చెప్పాలి..
అదనపు స్పిల్ వే నిర్మించి ఉంటే..
ఇక అన్నమయ్య జిల్లాలో చెయ్యేరుపై అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట 2021, నవంబర్ 19న తెగిపోవడం ద్వారా అపార నష్టం వాటిల్లడానికీ చంద్రబాబే కారణం. చెయ్యేరుకు ఆకస్మికంగా వరదలొస్తాయని.. ఆ ఉధృతిని తట్టుకోవాలంటే మట్టికట్ట స్థానంలో అదనపు స్పిల్ వే నిర్మించాలని 2015, 2017లలో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు అదనపు స్పిల్ వే నిర్మించి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయేది కాదు. అలాగే, పింఛా ప్రాజెక్టు మట్టికట్ట బలహీనంగా ఉందని.. దానికీ మరమ్మతు చేయాలని 2015లో నిపుణుల కమిటీ చేసిన సూచనను చంద్రబాబు పట్టించుకోలేదు. దానివల్ల 2021, నవంబరు 19న ఇది తెగిపోయింది.