కళ్లెదుట సాయం  కనిపిస్తున్నా... ఈనాడు కబోది రాతలు

Eenadu Fake News On Flood Relief Operations Of AP Govt - Sakshi

రేపటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

అందుకు రంగాన్ని సిద్ధం చేసేందుకు ‘ఈనాడు’ కుట్రలు

వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై విషం గక్కిన రామోజీ

అధికారులు, వలంటీర్ల స్థయిర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు రాతలు

వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది

ఆరుగురేసి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో చురుగ్గా సహాయ కార్యక్రమాలు

ఏది నిజం?
ఆరుగురు కలెక్టర్లు... ఆరుగురు జాయింట్‌ కలెక్టర్లు... ఆరుగురు ఎస్పీలు... వారం రోజులుగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 30వేల మంది గ్రామ సచివాలయాల సిబ్బంది... వలంటీర్లు కలిసి ఓ సైన్యంలా అహర్నిశలూ పనిచేశారు. 90 శాతానికి పైగా యువకులతోనే నిండిన వైద్య బృందాలు శక్తివంచన లేకుండా ముంపు ప్రాంతాలకు పరుగులు పెడుతూ సేవలందించాయి. ముఖ్యమంత్రి గోదావరి గట్టున కూర్చుని హడావుడి చేయలేదు. సహాయ కార్యక్రమాలకు అడ్డు తగల్లేదు. తాను స్వయంగా ఏరియల్‌ సర్వే చేసి... నిత్యం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఒక్క బాధితుడినీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, మీరే ఆ స్థానంలో ఉంటే ఏమాశిస్తారో అవన్నీ వారికి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రులు అధికారులతో సమీక్షించటమే కాక... ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

ఈ సారి గోదావరికి ‘నభూతో..’ అనే తరహాలో ప్రళయంలా వరదలొచ్చాయి. అది కూడా అనూహ్యంగా జూలైలో!!. 70 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం... తాము పుట్టాక ఎన్నడూ ఇంతటి విపత్తు చూడలేదని వాపోయారంటే పరిస్థితి తేలిగ్గానే అర్థమవుతుంది. అంతటి విపత్తును సైతం... ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అధిగమించింది. పెద్దగా ప్రచారార్భాటాలు లేకుండానే అంతటి విలయాన్నీ తేలిగ్గా దాటగలిగింది. అదే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కాకుండా ఏ చంద్రబాబు నాయుడో అధికారంలో ఉంటే... ‘ఈనాడు’, దాని తోకపత్రిక, ఇతర ఎల్లో మీడియా కలిసి దీన్నో అరుదైన రికార్డుగా అభివర్ణించేవి. చంద్రబాబుకు తప్ప ఈ భూమ్మీద పుట్టిన మానవమాత్రుడెవ్వడికీ ఇంతటి సమర్థత సాధ్యం కాదని కీర్తించేవి.

కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నది వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి. కాబట్టి ప్రశంసల్లేవు సరికదా.. వరదొచ్చిన మొదటి రోజు నుంచీ ఒకటే పాట. సహాయ కార్యక్రమాలు సరిగా జరగటం లేదని, బాధితులకు కనీసం ఆహారం కూడా అందటం లేదని!!. పైపెచ్చు చంద్రబాబు నాయుడి హయాంతో పోలిక. అప్పట్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తే భోజనంతో పాటు పిల్లలకు పాలు, బిస్కెట్లు కావలసినన్ని ఇచ్చేవారంటూ కథనాలు. 

అసలు చంద్రబాబు హయాంలో ఎప్పుడు చూసినా కరువే తప్ప వరదలొచ్చింది ఎన్నడు? నిజంగా చంద్రబాబు హయాంలో ఇలాంటి పరిస్థితులొస్తే ఏమైనా చేశారా? అప్పటికీ, 
ఇప్పటికీ తేడాలేంటి? ‘‘పిల్లలకు పాలచుక్క లేదు.. పెద్దలకు తిండి లేదు’’ అంటూ రామోజీరావు రాసిన విషపు రాతల్లో నిజమెంత? ఏది నిజం? 

చంద్రబాబునాయుడి హయాంతో పోలిస్తే ఇప్పుడు జిల్లాల సంఖ్య రెండు నుంచి 6కు పెరిగింది. ఫలితంగా ఆరుగురు కలెక్టర్లు, అదే సంఖ్యలో జేసీలు, ఎస్పీలు అందుబాటులోకి వచ్చి సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. గ్రామసచివాలయాలు గానీ, వలంటీర్లు గానీ అప్పట్లో లేనేలేరు. వీరి రూపంలో ఈ జిల్లాల నుంచి దాదాపు 30 వేల మందికిపైగా సైన్యం విరామమన్నది లేకుండా శ్రమించింది. ఇక శిబిరాల నుంచి వెళ్లేటపుడు బాధితులకు రూ.2వేలు ఇవ్వటమనేదీ లేదు.

ప్రతి కుటుంబానికీ 25 కిలోల రేషన్‌తో పాటు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు ఇతర రేషన్‌ సరుకులు అందజేశారు. మరి ఇవేమీ లేకున్నా చంద్రబాబు హయాంలో అన్నీ అత్యద్భుతంగా చేశారని ఎలా రాస్తారు రామోజీరావు గారూ? పాఠకులంటే మరీ అంత చులకనా? రేపటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు కనక... దానికి తగ్గ రంగాన్ని సిద్ధం చేయటమే మీ వార్తల ఎజెండా అని చిన్నపిల్లాడిక్కూడా తెలుస్తూనే ఉంది? మీరు అచ్చోసిన వార్తలు చూపిస్తూ... బాధిత ప్రాంతాల్లో మీ మీడియా సమక్షంలో చంద్రబాబు చెలరేగిపోతారని... మళ్లీ మీరే వాటిని పతాక శీర్షికల్లో మరోసారి అచ్చు వేస్తారని తేలిగ్గా అర్థమవుతూనే ఉంది.

అయినా క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను తొక్కిపట్టి మీరేం చెబితే అది నమ్మటానికి ఇది 1990ల కాలం అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జనానికి తెలుస్తూనే ఉన్నాయి. వలంటీర్ల నుంచి ప్రతి ఒక్కరూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నారు.  

అధికారులు పక్కా ప్రణాళికతో వెళ్ళారు కనకే... 
గోదావరికి ముందస్తుగా వరదలొచ్చినా... గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ఆఘమేఘాల మీద స్పందించి పక్కా ప్రణాళికతో వెళ్లారు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయటంతో కలెక్టర్లు వాటిని విత్‌డ్రా చేసుకుని సహాయ కార్యక్రమాల్లో వినియోగించారు. ఊళ్లు మునగక ముందే వాటిని ఖాళీ చేయించారు. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. లక్ష మందికిపైగా బాధితుల్ని సహాయ శిబిరాల్లో ఉంచి వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చారు. 6 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 217 సహాయ శిబిరాలు... అందులో ఉన్న 1,00,775 మంది జనమే దీనికి నిదర్శనం. సహజంగానే ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించలేదు.

తొలిరోజు నుంచీ ఇప్పటివరకూ వీటి వంకే చూడని ‘ఈనాడు’... ఎక్కడో దూరంగా సొంత టెంట్లు వేసుకుని ఉన్నవారిని పలకరించి... వారిలో కూడా ఒకరిద్దరికి ఎక్కడైనా భోజనాలు అందలేదేమో వెదికి... వారినే ఉదాహరణగా చూపిస్తూ మొత్తం పరిస్థితి ఇలాగే ఉందంటూ విషం చిమ్మటానికి పూనుకుంది. ఇంతటి భారీ విపత్తులొచ్చినపుడు ఎక్కడో ఒక మూలన ఒకరిద్దరికి సాయం అందకపోయే అవకాశాలుండొచ్చు. ప్రభుత్వ యంత్రాంగం వారిని గుర్తించలేకపోయి ఉండొచ్చు.

తాము బంధువుల ఇంట్లో ఉన్నా కూడా... భోజనాల సమయానికి శిబిరాలకు వెళ్లి తెచ్చుకున్నామని కొన్ని వేల మంది చెబుతున్నారు. తాము శిబిరాలకు వెళ్లకపోయినా ఇళ్లకొచ్చి మరీ భోజనాలు అందించారని మరికొన్ని వేల మంది చెప్పారు. వాళ్లెవరూ ఈ పచ్చకామెర్ల రామోజీకి కనిపించరు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే!!. చంద్రబాబు గొప్పోడని తాను రాసే తప్పుడు వార్తలకు మద్దతుగా ఒకరిద్దరు చాలు. అంతే! చెలరేగిపోతారు. అదే జరుగుతోంది గత వారంరోజులుగా..!! 

లక్ష మందికిపైగా తరలింపు 
► వరద ముంపులో చిక్కుకున్న ఆరు జిల్లాల్లోని 263 గ్రామాలకు చెందిన లక్షా 775 మందికి ప్రభుత్వం సహాయ శిబిరాల్లో ఆశ్రయం కల్పించింది. ఇంతమందిని శిబిరాలకు తరలించడానికి అధికార యంత్రాంగం అలుపు లేకుండా పనిచేసింది.  
► అల్లూరి జిల్లాలో గోదావరి మధ్య కొండల్లో ఉన్న గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో గోదావరి ఒడ్డునున్న గ్రామాలకు చెందిన వారిని తీసుకురావడం మామూలు విషయం కాదు. శ్రమించి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. దీనివల్లే ఊహించని విధంగా భారీ వరద వచ్చినా నష్టాన్ని పరిమితం చేయగలిగారు.  
► తరలించిన వారందరి కోసం అల్లూరి, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో 217 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 103 శిబిరాల్లో 59,476 మందికి ఆశ్రయం కల్పించారు.  
► ఈ శిబిరాల్లో ఉన్న వారికి అల్పాహారం, రెండు పూటలా భోజనం... చిన్న పిల్లలకు పాలు, బ్రెడ్‌ అందించారు. ముంపు గ్రామాల్లోని పశువులను సైతం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ దాణా ఉంచడంతో పాటు పశు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు.  
► వరద నీరు చేరిన 403 గ్రామాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, లీటర్‌ ఆయిల్‌ అందజేశారు. 5 జిల్లాల్లో 1124 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 77.26 టన్నుల కందిపప్పు, 22471 లీటర్ల పామాయిల్, 66703 లీటర్ల పాలు, 21451 కేజీల ఉల్లిపాయలు, 19521 కేజీల బంగాళా దుంపలు పంపిణీ చేశారు. 
► సహాయ శిబిరాల వద్దే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 6 జిల్లాల్లో 260 వైద్య శిబిరాలు నిర్వహించారు.  
► 10 ఎన్డీఆర్‌ఎఫ్, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముంపు ప్రాంతాల్లో విరామం లేకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 182 మందిని రక్షించగా 3006 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 4501 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  
► రెండు హెలికాఫ్టర్ల ద్వారా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నల్లకుంట, వంజాం, తొండిపాక, మిట్టగూడెం, బంజారగూడెం, గుంపునల్లి, ఇబ్రహీంపేట, అల్లగూడెం, బొనగరి, వెంకటాపురం, బురుగువాయి గ్రామాల్లో ఆహార పొట్లాలు, కూరగాయలు, నిత్యావసరాల ప్యాకెట్లు జార విడిచారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top