
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాది నూర్ మహ్మద్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాడిపత్రికి చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను నూర్ ప్రేయసిగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఆమెకూ ఉగ్రకార్యకలాపాలతో సంబంధాలున్నాయా? అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ధర్మవరంలో ఉగ్రకదలికలు వెలుగు చూడడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఓ హోటల్‌లో వంటవాడిగా పని చేస్తున్న నూర్ మహ్మద్(40) ఉగ్రవాద సానుభూతిపరుడని తేలింది. గతకొంతకాలంగా అతని కదలికలపై నిఘా వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంతో లోకల్ పోలీసులు ఆగస్టు మూడో వారంలో అరెస్ట్ చేశారు. అంతేకాదు..
కోట ఏరియాలో అతని నివాసంలో సోదాలు జరిపి 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మెంబర్‌గా ఉన్నాడని, అందులోని నెంబర్లకు ఇతని నుంచి వాట్సాప్ కాల్స్ వెళ్లాయని.. ముస్లిం యువతను ఉగ్ర సంస్థ వైపు మళ్లించేలా అందులో వ్యాఖ్యలు సైతం చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో.. అతని వ్యక్తిగత వివరాల గురించి ఐబీ, ఎన్‌ఐఏ వర్గాలు ఆరా తీశాయి. ఈ క్రమంలో..
అతని కుటుంబ వివరాలేవీ తెలియరాలేదు. కాకుంటే తాడిపత్రిలో ఉంటున్న ఓ మహిళతో నూర్ చనువుగా ఉన్నాడని మాత్రం అతని కాల్స్ రికార్డు ఆధారంగా తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ.. గోరుముద్దలు చూపించుకుంటూ.. ఆ స్క్రీన్ షాట్స్‌ను సేవ్ చేసుకున్నారు. ప్రతీరోజూ ఆమె అతనితో గంటల తరబడి ఆడియో, వీడియో కాల్ మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన కాల్ రికార్డ్స్ ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు..
తొలుత జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరపగా.. గత నాలుగు రోజులుగా పోలీసులూ అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. జైషేతోనే కాకుండా ఇతర ఉగ్రసంస్థలతోనూ అతనికి సబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.