నకిలీ చలాన్లలో రూ.3.38 కోట్లు రికవరీ | Sakshi
Sakshi News home page

నకిలీ చలాన్లలో రూ.3.38 కోట్లు రికవరీ

Published Thu, Aug 26 2021 5:24 AM

Dharmana Krishnadas Comments About Fake Challans - Sakshi

సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్‌ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ  ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం తప్పుడు చలాన్ల ద్వారా రూ. 7,13,76,148 ఆదాయానికి గండిపడిందని గుర్తించామన్నారు.

అందుకు  బాధ్యులను గుర్తించి ఇండియన్‌ స్టాంప్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.38 కోట్లు రికవరీ చేశామని, ఇంకా రూ.3.75 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. అధికారుల తనిఖీలలో 11 జిల్లాల్లోని 36 సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 1,252 డాక్యుమెంట్లకు సంబంధించిన తప్పుడు చలానాలు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి, 9 మంది సబ్‌–రిజిస్ట్రార్లను విధుల నుంచి తప్పించామన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  సీఎఫ్‌ఎంఎస్‌ను సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అనుసంధానించామని, ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మాన వివరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement