ఏపీ విద్యా పథకాలు అద్భుతం.. ఢిల్లీ విద్యావేత్తల బృందం ప్రశంసలు

Delhi SCERT Team Visit AP Praises Education And Welfare Methods - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు, పథకాలు, వాటిని సమగ్రంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన విద్యావేత్తల బృందం ప్రశంసించింది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలవుతున్న వివిధ పథకాలు, స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో 60 మంది విద్యావేత్తల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా విజయవాడలో 28 మంది సభ్యుల బృందం గత రెండు రోజులుగా కృష్ణా జిల్లాలోని పెనమలూరు, నిడమానూరు పాఠశాలలను సందర్శించింది. ఈ బృందానికి రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి ఆహా్వనం పలికారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, డిజిటల్‌ విద్య, జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, ద్వి భాషా పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల సహ పాఠ్య కార్యక్రమాలను బృందం పరిశీలించింది.

పెనమలూరు విద్యార్థుల డ్రమ్స్, నిడమానూరులో యోగా ప్రదర్శనలను ఆసక్తితో తిలకించింది. అనంతరం రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది. ఎస్‌సీఈఆర్‌టీ అధ్యాపక బృందంతో వివిధ బోధన విధానాల గురించి పరస్పరం అభిప్రాయాలు పంచుకుంది. ఢిల్లీలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా బృందం వివరించింది.

అనంతరం సమగ్ర శిక్ష కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఎస్పీడీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాల్ట్‌ పథకంలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థలు విద్యాశాఖతో కలిసి పనిచేస్తున్న అంశాల మీద అవగాహన కలి్పంచారు. మృదుల భరద్వాజ్‌ ఆధ్వర్యంలో పర్యటిస్తున్న ఈ బృందం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్న మంచి విధానాలపై తమ రాష్ట్ర అధికారులకు నివేదిక సమరి్పస్తామని మృదుల భరద్వాజ్‌ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top