మాటేస్తున్న ఈ-దొంగల ముఠా.. సర్వేలో సంచలన విషయాలు!

Cyber Thieves Extorting Money From Online Customers - Sakshi

కొనుగోలుదారులను, మోసం చేస్తున్న కేడీలు 

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఈ–కామర్స్‌ వ్యాపారం 

అంతే వేగంగా పెరుగుతున్న మోసగాళ్ల దందా 

సాక్షి, అమరావతి: పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు బిగ్‌ బిలియన్‌ డేస్, షాపింగ్‌ కార్నివాల్‌ అంటూ ఏదో ఒక పేరు పెట్టి స్పెషల్‌ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇదే అదనుగా సైబర్‌ దొంగల ముఠా వినియోగదారుల డేటా కొట్టేయడానికి కాచుకు కూర్చుంటోంది. హోమ్‌ క్రెడిట్‌ ఇండియా 
తాజా సర్వే ప్రకారం.. మన దేశంలో 50 శాతంపైగా ప్రజలు షాపింగ్‌ కోసం ఈఎంఐను అందించే కార్డులను ఇష్టపడుతున్నారు. 25 శాతం మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. 

‘ఇప్పుడు కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ అనే ప్రత్యేక ఆఫర్‌ను ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని ఈ–కామర్స్‌ సంస్థలు అందిస్తున్నాయి. 10 శాతం మంది దీనిని వినియోగించుకుంటున్నారు. 50 శాతం మంది వాట్సాప్‌ చాట్‌ ద్వారా రుణ దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. లోన్‌ అప్లికేషన్‌ ఫైల్‌ చేయడానికి చాట్‌బాట్‌లు, మొబైల్‌ బ్యాంకింగ్‌ కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ క్రమంలో డెబిట్‌ కార్డ్, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలను ఇంట్లోనే కూర్చొని డార్క్‌ వెబ్‌ ద్వారా సేకరించి,  ఆన్‌లైన్‌లోనే డబ్బులు కొట్టేసే మార్గాన్ని దొంగలు  ఎంచుకున్నారు. దీనికి ఈ–కామర్స్‌ సైట్లలో మనం ఇచ్చే బ్యాంకు ఖాతాల వివరాలను వాడుకుంటున్నారు. కాగా, గ్లోబల్‌ రిటైల్‌ ఈ–కామర్స్‌ 2020­లో 26.4 శాతం పెరిగింది. సైబర్‌ నేరగాళ్లు కూడా ఈ పెరుగుదలను సద్వి­నియోగం చేసుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

సైబర్‌ దొంగలు రిటైల్‌ వెబ్‌సైట్‌లకు నకిలీ రూపాలు సృష్టించి, దుకాణదారులను, కస్టమర్లను దోచుకుంటున్నారు. ఆ సైట్‌ నిజమైనదిగా నమ్మేలా ఉంటుంది. వాటి ద్వారా ఓ నకిలీ ఆర్డర్‌ షిప్‌మెంట్‌ను కస్టమర్లకు మెయిల్‌గానీ, ఎస్‌ఎంఎస్‌ లింక్‌గానీ పంపుతారు. తెలియకో, అప్రమత్తంగా లేకో ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే.. అక్కడ కస్టమర్లు లాగిన్‌ అవడానికి ఇచ్చే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు దొంగలకు వెళ్లిపోతాయి. వారు కస్టమర్‌ కార్డులను ఉపయోగించి రిటైల్‌ సైట్‌లో షాపింగ్‌ చేసేస్తారు. ఒక్కోసారి ఏదో వస్తువును ఆర్డర్‌ పెట్టామని చెప్పి, దానికి నగదు చెల్లించాలంటూ క్యూఆర్‌ కోడ్‌లను పంపుతారు. 

దానిని స్కాన్‌ చేస్తే చాలు మన బ్యాంకు వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. ఇలా కస్టమర్లనే కాదు ఈ–కామర్స్‌ నిర్వాహకులను కూడా మోసం చేస్తున్నారు. ఆర్డర్‌ పెట్టిన ప్యాకేజీ రాలేదని, ఆర్డర్‌ వచ్చిందిగానీ పెట్టె ఖాళీగా ఉందని, బాక్స్‌లో రిటైలర్‌ తప్పు వస్తువును పంపారని ఫిర్యాదు చేసి డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏడాదిగా సైబర్‌ నేరగాళ్లు ఈ–కామర్స్‌ సైట్లపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్టు సైబర్‌ క్రైమ్‌ విభాగం ఇప్పటికే గుర్తించింది. ఇలాంటి మోసాలు పెరగడం పట్ల ఇటు వినియోగదారులు, అటు ఈ–కామర్స్‌ సైట్ల నిర్వాహకులు కూడా ఆందోళన చెందున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top