సత్ఫలితాలిస్తున్న కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌

Conviction based policing that works - Sakshi

మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి 2022లో నమోదైన 108 కేసుల్లో ఏడురోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు

48 కేసుల్లో కోర్టు విచారణ పూర్తి 

నేరస్తులకు జీవితఖైదు, 25 సంవత్సరాల వరకు జైలుశిక్ష

సాక్షి, అమరావతి: దిశ స్పూర్తితో మహిళలపై జరిగిన నేరాల్లో బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర పోలీస్‌ శాఖ అవలంభిస్తున్న కన్విక్షన్‌ బేస్‌ పోలీసింగ్‌ విధానం సత్ఫలితాలిస్తోంది. ఈ విధానాన్ని గత ఏడాది జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో, మహిళలు హత్య, అత్యాచారం, ఇతర వేధింపులకు గురైన కేసులను జిల్లాకు ఐదు చొప్పున ఎంపికచేసి ఏడురోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, దాదాపు 108 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

దీంతో 48 కేసుల్లో కోర్టు విచారణ పూర్తయి నేరస్తులకు జీవితఖైదుతో పాటు, ఏడు నుంచి 25 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడింది. 13 కేసుల్లో విచారణ పూర్తయి తీర్పులు రిజర్వ్‌ అయ్యాయి. 47 కేసుల్లో విచారణ ముగింపుదశలో ఉంది. మరోవైపు గత ఏడాది నమోదైన 101 పోక్సో కేసుల్లో నేరస్తులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడ్డాయి.

దిశ స్ఫూర్తితో పోలీస్‌ శాఖ చేసిన కృషితో ఈ ఏడాది రాయచోటి, కోనసీమల్లో మహిళలు అత్యాచారం, హత్యకు గురైన కేసులు, ఏలూరు జిల్లాలో తల్లీకూతుళ్ల అమానూష హత్య, బాపట్లలో ప్రేమ పేరుతో వేధింపులకు గురై యువతి హత్యాయత్నం సహా పలు కేసుల్లో ఏడురోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. 

కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ ఇలా..
ఈ విధానంలో ఎస్పీలు తమ పరిధిలో నమోదైన మహిళలు, యువతులు, చిన్నారులపై జరిగిన ఐదు తీవ్రమైన నేరాల కేసులను ప్రాధాన్యమైనవిగా ఎంపిక చేస్తారు. ఈ కేసులను.. ప్రతిరోజు షెడ్యూల్‌ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్‌ పురోగతిపై సమీక్షిస్తారు. తద్వారా కేసు ట్రైల్‌ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్షపడటమేగాక ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోకుండా అవకాశం ఉంటుంది.

ఈ కేసులపై ఐపీఎస్‌ అధికారి ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడంతో నేరస్తులు సాక్షులను బెదిరించే ఘటనలకు ఆస్కారం ఉండదు. డీజీపీ సైతం తన రోజువారీ ఎస్పీల టెలీకాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఈ కేసులపై చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. 

సమష్టి కృషితోనే సాధ్యం
కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ విధానం సత్ఫలితాలిస్తోంది. నేరస్తులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి అన్ని స్థాయిల్లోని అధికారుల సమష్టికృషితోనే ఇది సాధ్యం అవుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది. 
– కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top