దారుణంగా ధరల పతనం
ఎకరాకు రూ.40 వేల నుంచి 60 వేలకు పైనే నష్టం..
గతేడాది కన్నా పెరిగిపోయిన నష్టాలు..
పట్టించుకునే నాథుడు లేక రైతులు విలవిల
ఏలూరు కాంక్లేవ్‌లో బాబు సర్కార్ గొప్పలు
కోకో సిటీ, ధరల పాలసీ ఎక్కడ?
మద్దతు ధర ప్రకటించి కంపెనీలను నియంత్రించాలి
కోకో రైతుల డిమాండ్..
సాక్షి, అమరావతి: ఏలూరు వద్ద కోకో సిటీని ఏర్పాటు చేస్తున్నాం..ఆయిల్ పామ్ రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తాం..నూనె వెలికితీత నిష్పత్తి(ఓఈఆర్) ఫార్మూలా ప్రకారం ఏటా ఆయిల్ పామ్ తాజా గెలల ధరల నిర్ణయిస్తున్న మాదిరిగానే కోకో ధరల నిర్ణాయక విధానం తీసుకొస్తాం’ అని ఇటీవలే ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్‌లో చంద్రబాబుప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో సిండికేట్‌గా మారిన ముఠా.. రైతులను దోపిడీ చేస్తుంటే ఇదే ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోందంటూ కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో సాగవుతుంది. ప్రధానంగా కొబ్బరి, ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సగటున 12వేల టన్నుల గింజల దిగుబడి వస్తుంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ సేకరిస్తుండగా, మిగిలిన గింజలను నెస్లే, క్యాంప్కో, లోటస్ తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి.
కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్‌లోనూ, ఒక వంతు అన్ సీజన్‌లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సిండికేట్ మాయాజాలంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.
పెరిగిన పెట్టుబడులు.. దిగజారిన దిగుబడులు
గతేడాది అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.750 ధర పలుకుతున్న సమయంలో స్థానికంగా కంపెనీలు సిండికేట్‌గా మారి కిలో రూ.350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేయగా, ప్రభుత్వం కిలోకి రూ.50 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 23న జీవో జారీ చేయగా, అప్పటికే రైతులు తమ వద్దనున్న పంటను అయినకాడికి తెగనమ్ముకోవడంతో ఎకరాకు రూ.40 వేల వరకు నష్టపోయారు.
ఇక నుంచి కంపెనీలు కిలోకు రూ.500 తక్కువ కాకుండా కొనుగోలు చేస్తాయని ప్రచారం జరగడంతో లీజులు అమాంతం పెంచేశారు. అప్పటి వరకు ఎకరాకు రూ.1.20 లక్షలు వసూలు చేస్తుండగా, ఈ ఏడాది రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెంచేశారు. మరొక పక్క పెరిగిన ఎరువులు ధరలు, కూలీ ఖర్చులు కోకో రైతులకు పెను భారంగా మారాయి. పొటాష్ 50 కేజీల బస్తా రూ.1,600 నుంచి రూ.1,950కు పెరిగింది. కూలీ ఖర్చులు మగవాళ్లకు రూ.450 నుంచి రూ.520కి, ఆడవాళ్లకు రూ.200 నుంచి రూ.280కి పెరిగాయి.
ఇలా ఎకరాకు రూ.45వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడులు పెరిగాయి. మరోపక్క తేనె మంచు, ఇతర తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు అనూహ్యంగా పడిపోయాయి. గతేడాది ఎకరాకు 4క్వింటాళ్లు రాగా, ఈఏడాది 2.5 క్వింటాళ్లు రావడం గగనమైపోయింది. సరిగ్గా ఇదే సమయంలో కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ ధరలను బూచిగా చూపి అడ్డగోలుగా ధరలను తగ్గించేస్తూ వచ్చారు. 2023–24 సీజన్‌లో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించగా, గతేడాది ప్రీమియం గింజలకు రూ.350 నుంచి రూ.450, అన్‌సీజన్ గింజలకు కిలో రూ.200–250కు మించి కొన్న దాఖలాలు లేవు.
ఫలితంగా ఎకరాకు రూ.40 వేలవరకు నష్టపోయారు. కాగా ఈ ఏడాది అంత కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీమియం గింజలకు సైతం ఈ ఏడాది వ్యాపారులు కిలోకు రూ.280 చెల్లిస్తుండగా, కంపెనీలు రూ.300కు మించి చెల్లించడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఓ వైపు, కంపెనీల మాయాజాలంతో మరొక వైపు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కనీసం ఎకరాకు రూ.45వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
కోకో గింజల ధరల పాలసీ ఏది?
కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నాయి. సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా వారు చెప్పిందే ధర.. ఇచి్చందే పైకం అన్నట్టుగా వీరి దందా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలతో సంబంధం లేకుండా ధరలను తగ్గించి దోపిడీకి పాల్పడుతున్నారు. గతేడాది వీరి దోపిడీకారణంగా కోకో రైతులు రూ.500 కోట్ల మేర నష్టపోయారు. కోకో కాంక్లేవ్æలో చేసిన ప్రకటన మేరకు తక్షణమే కోకో గింజల ధరల పాలసీని ప్రకటించాలి. కోకో గింజలకు మద్దతు ధర ప్రకటించి కంపెనీలు ఆ ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కోకో రైతుల సంఘం
ఈ రైతు పేరు అవర్ని అనిల్‌కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలు కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నారు. గతేడాది ఎకరాకు రూ.1.20 లక్షలు కౌలుకు ఇస్తే. ఈ ఏడాది రూ.1.75 లక్షలకు పెంచేశారు. కొన్ని చోట్ల రూ.2 లక్షలు కూడా డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు రూ.45 వేలకు పైగా అవుతోంది. గతేడాది ఎకరాకు 4 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 2.5 క్వింటాళ్లు వచ్చాయి.
ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు కిలోకు రూ.280 చెల్లిస్తుంటే స్థానిక మాండలేజ్ కంపెనీ రూ.300 ఇస్తోంది. గతేడాది మాదిరిగానే ఈఏడాది కూడా ఎకరాకు రూ.60వేల వరకు నష్టపోతున్నామంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కోకో రైతులను ఆదుకోకపోతే తీవ్ర నష్టాలను చవి చూస్తామని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.


