నేడు విజయనగరానికి సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan To Visit Vizianagaram Today - Sakshi

గుంకలాం లేఅవుట్‌లో పట్టాల పంపిణీ 

అతి పెద్ద కాలనీలో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో సీఎం జగన్‌ పైలాన్‌ ఆవిష్కరించి,  లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం గృహ నిర్మాణాలకు భూమి పూజలో పాల్గొంటారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం విజయనగరం జిల్లాకు బయలుదేరి 11:15 గంటలకు గుంకలాం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 

విజయనగరం జిల్లాలోని గుంకలాం లేఅవుట్‌  

►ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
►విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం  అతి పెద్ద లేఅవుట్‌  రూపొందించారు. రూ.4.37 కోట్లతో ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు.  భూమి కోసం 428 మంది రైతులకు రూ.101.73 కోట్ల నష్ట పరిహారం చెల్లించారు.  
►విజయనగరం జిల్లాలో 1,08,230 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,164 లేఅవుట్‌లను సిద్ధం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top