CM Jagan: శాన్వికకు సీఎం జగన్‌ ఆపన్నహస్తం.. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు ఆదేశాలు

CM YS Jagan Support To Thalassemia Suffering girl - Sakshi

శాన్వికకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తానని సీఎం హామీ 

అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు 

బాలికకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన తలసేమియా బాధిత బాలికకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. దర్శిలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుమారుడి రిసెప్షన్‌ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నిషితకుమారి ఏకైక సంతానం అయిన ఎనిమిదేళ్ల బసవనాట శాన్విక అనారోగ్య పరిస్థితిని స్థానికులు, నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శాన్విక తలసేమియాతో బాధపడుతోందని, నెలకు రెండుసార్లు రక్త మార్పిడి చేయించాల్సి వస్తోందని చెప్పారు.  

నెలకు రూ.12 వేలకుపైగా ఖర్చవుతున్నట్లు తెలిపారు. ఓ నెగిటివ్‌ గ్రూపు రక్తం దొరకటం కూడా కష్టంగా ఉందన్నారు. పాపకు బోన్‌మ్యారో (ఎముక మజ్జ) చికిత్స చేయించాలని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు సీఎంకు తెలిపారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని, సుమారు ఆరేళ్ల కిందట తన భర్త తనను పట్టించుకోకుండా వదిలేసి ఇంటినుంచి వెళ్లిపోయాడని బాలిక తల్లి నిషితకుమారి చెప్పారు.

తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, వారి పోషణ బాధ్యత కూడా తానే చూసుకుంటున్నానని తెలిపారు. చిన్నారి శాన్వికతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యే  కంగా మాట్లాడారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు.  

జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం  
పాపే నాకు ప్రాణం.. నా పాపకు ప్రాణం పోస్తానన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నేను జీవితాంతం రుణ పడి ఉంటా. నువ్వు బాధపడకు.. నేను చూసుకుంటానని ఆయన నాకు భరోసా ఇచ్చారు. వెంటనే నా పాపకు వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం కల్లా సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ నుంచి, తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌లు చేసి పాప వివరాలు తీసుకున్నారు. నా పాపకు ప్రాణం పోస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది.   
 – నిషితకుమారి, శాన్విక తల్లి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top