పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

CM Jagan: సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు.. పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం: అధికారులతో సీఎం జగన్‌

Published Wed, Aug 10 2022 12:31 PM

CM YS Jagan Review On Welfare Hostel And Gurukul Schools - Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు.

స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం.. హాస్టళ్లలో వైద్యుల సందర్శన తప్పనిసరి అన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్‌ ఛార్జీలను పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులపాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ నేతృత్వంలో విస్తృత సమీక్ష జరిగింది.

ఈ సమీక్షలో..
► ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.
► ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేపట్టాలి.
► స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు
► ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ కిందకు హాస్టళ్లు, గురుకులాలు
► గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్‌ ఛార్జీలను పెంచాలని..  సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఇంకా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన స్వయంగా నేనే చేయించాను.
► మనం చేయాల్సింది చాలా ఉంది. దీనిపై ఒక కార్యాచరణ ఉండాలి. 
► ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలి. 
► ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం.
► మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. 
► సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి.
►  దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదు.  అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి.
► అభివృద్ధి పనులు చేశాక..  వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి.  దీనిమీద ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి.

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి... సీఎం జగన్‌
► హాస్టళ్ల నిర్వహణకోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచండి. 
► పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి:
► మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలి. 
► పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి.
► స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయండి:
► ప్రతి హాస్టల్‌లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి :
► హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్‌మెన్‌ల వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి:
► ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్‌ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. 

► డైట్‌ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్‌ ఛార్జీలను పెంచాలి. సమూలంగా డైట్‌ ఛార్జీలు పరిశీలించి.. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలి.  గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్‌ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్‌ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అలాంటిది కాదు అని సీఎం జగన్‌ అధికారుల వద్ద ప్రస్తావించారు.

హాస్టళ్లలో నాడు–నేడు
అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం జగన్‌.. వాటి నిర్వహణను కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఇంకా..
► వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం.
► మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి.
► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి.
► ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 
► అదనంగా కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లను కూడా చేర్చాలని.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించేలా ఉండాలని సీఎం జగన్‌, అధికారులతో చెప్పారు.
► ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్న సీఎం జగన్‌.. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్,  బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement