పోలవరం కీలక పనులపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Review Meeting On Polavaram Project In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు కీలక పనులపై సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. మే నెల చివరినాటికి ‘కాఫర్‌ డ్యాం’ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై అధికారులతో సీఎం జగన్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. స్పిల్‌ వే పూర్తికాకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారని అధికారుల​తో చర్చించారు. గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని అధికారులు  సీఎం జగన్‌కు తెలిపారు.

దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద  గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో  భారీ ఎత్తున కోతకు గురైందని అధికారులు ప్రస్తావించారు. ఫలితంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. ఈ పనులు అన్నింటిపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. అదేవిధంగా స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. దీనివల్ల వచ్చే వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ అధికారులకు తెలిపారు. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపైన సీఎం జగన్‌ సమీక్షించారు. 

ఎత్తు తగ్గింపు లేదు.. అది వీలుకాదు
పోలవరం ఎత్తు తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాలను పట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అసలు అలాంటి అవకాశమే లేదని అధికారులు  స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విస్పష్టంగా చెప్పాయని అధికారులు అన్నారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు.

నదుల అనుసంధానంపైనా సమీక్ష
నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫునుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఉండాలన్నారు. నదుల అనుసంధానం వల్ల ఇక్కడ ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అయోమయాలకు, సందిగ్ధతలకు తావులేకుండా, ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులకు తెలిపారు. వాటిని కేంద్రానికి పంపుదామని అధికారులకు సీఎం జగన్‌ చెప్పారు. మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై ప్రతిపాదనల నేపథ్యంలో అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

పోలవరం వద్ద వైఎస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై సీఎం సమీక్ష
పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న వైయస్సార్‌ విగ్రహం, వైయస్సార్‌ గార్డెన్స్‌పై మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.  కాలం గడుస్తున్నకొద్దీ ఆహ్లాదం, అందం పెరిగేలా వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణ రీతులు ఉండాలన్న సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్లను రూపొందించాలన్నారు. ప్రకృతి సమతుల్యతను మరింత పెంచే విధంగా నిర్మాణరీతులు ఉండాలని సీఎం జగన్‌ అధికారుల ఆదేశించారు. నిర్వహణా వ్యయం కనిష్టంగా ఉండేలా డిజైన్లను రూపొందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ బ్రిడ్జి నుంచి జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డును అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం జగన్‌ సానుకూలత వ్యక్తం చేశారు.ఈ సమీక్షలో  సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి  జే శ్యామలరావు, ఈఎన్‌సీసీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top