అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On Nadu Nedu Works In Schools - Sakshi

సాక్షి, అమరావతి : నాడు-నేడు తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కచ్చితంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనుల పరిశీలన కోసం విద్యాశాఖలో ఉన్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల్లో హాస్టళ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. 2022 సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్‌ బెడ్లతో సహా, అన్ని సదుపాయాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. మంచాలు, పరుపులు, బెడ్‌షీట్లు, బ్యాంకెట్లు, అల్మారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు-నేడు ‘మనబడి’పై సోమవారం క్యాంపు‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాడు నేడు’ లో పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడొద్దని పేర్కొన్నారు. చదవండి: సోమశిల రెండో దశకు సీఎం జగన్‌​ శంకుస్థాపన

జూనియర్ కళాశాలలు
రాష్ట్రంలోని ప్రతి మండలంలో తప్పనిసరిగా ఒక జూనియర్ కళాశాల ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. ప్రస్తుతం 159 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవని, అందువల్ల ఆయా చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. మనం ఏం కోరుకుంటామో.. మన పిల్లలను హాస్టల్‌లో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ కూడా అన్ని హాస్టళ్లలో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా బాత్‌రూమ్‌లు చక్కగా ఉండాలని, వాటిని బాగా నిర్వహించాలని అన్నారు. మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మెటీరియల్‌ వాడాలన్నారు. అన్ని బాత్‌రూమ్‌లలో హ్యాంగర్స్‌ కూడా ఉండాలని, గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్‌రూమ్‌లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం నేను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు. అందువల్ల హాస్టళ్లలో బాత్‌రూమ్‌ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం

ఇప్పటికే హాస్టళ్లలో మెనూకు సంబంధించి యాప్‌ ఉండగా, బాత్‌రూమ్‌లపై కూడా యాప్‌ డెవలప్‌ చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పనుల ఫలితాలు దీర్ఘకాలం ఉండాలని, కాబట్టి నిర్వహణలో ఎక్కడా అలక్ష్యం చూపొద్దని హెచ్చరించారు. ఆ విధంగా పెయింటింగ్‌తో సహా మెయింటెనెన్స్‌ ఉండాలని, భవిష్యత్తులో అంగన్‌వాడీలలో కూడా నాడు–నేడు కొనసాగుతుందన్నారు. కాబట్టి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ వద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ, ఏ స్కూల్‌లో, ఏ సమస్య వచ్చినా ఎంత వేగంగా స్పందించి, దాన్ని బాగు చేశామన్న దానిపై మన ప్రతిభ, పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. చదవండి: బాధితులకు వరం.. జీరో ఎఫ్‌ఐఆర్

జగనన్న విద్యా కానుక:
‘ఈ కిట్‌లో ప్రతి ఒక్కటి కూడా నాణ్యత కలిగి ఉండాలి. స్కూల్‌ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టెక్స్‌ట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, నోట్‌ బుక్స్‌ పంపిణీ. వచ్చే విద్యా సంవత్సరంలో జూన్‌ 12న స్కూళ్లు ప్రారంభం అవుతాయనుకుంటే పిల్లలకు జూన్‌ 1న పంపిణీ చేయాలి. ఆ మేరకు స్కూళ్లలో కిట్లు మే 15 నాటికి సిద్ధంగా ఉండాలి.

జగనన్న గోరు ముద్ద–హాస్టళ్లు:
హాస్టల్‌ పిల్లలకు ప్రతి రోజు ఒక వెరైటీ ఫుడ్‌ ఉండాలి, ఆ మేరకు ప్లాన్‌ చేయండి. మార్పు చేసిన మెనూ ప్రకారం పక్కాగా సరఫరా జరుగుతోందా? లేదా? అన్నది కూడా ఎంతో ముఖ్యం. ఆ ప్రకారం డిజైన్‌ చేసిన దాని ప్రకారం పెడుతున్నామా? లేదా? అన్నది మొదటి ప్రమాణం అని సీఎం వైఎస్‌‌ జగన్‌ స్పష్టం చేశారు. కాగా, కార్యక్రమంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. నాడు నేడు తొలి దశ పనులు కోవిడ్‌ కారణంగా కాస్త ఆలస్యమయ్యాయని, అయితే పనులు మాత్రం అత్యంత నాణ్యతగా కొనసాగుతున్నాయన్నారు. పేరెంట్‌ కమిటీలు, హెడ్మాస్టర్లు, సచివాలయాల ఇంజనీర్లు, టాటా ప్రాజెక్ట్స్‌ వంటి థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ కంపెనీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

అదే విధంగా సోషల్‌ ఆడిటింగ్‌ జరుగుతోందన్నారు. తొలి దశలో 15,715 స్కూళ్లలో మొత్తం రూ.1690.14 కోట్లతో పనులు జరుగుతున్నాయని, స్కూల్‌లో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు కేటగిరీలలో కిచెన్ల నిర్మాణం. రూ.5లక్షలు. రూ.15 లక్షలతో రెండు రకాల కిచెన్లు నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 9323 అంగన్‌వాడీలు స్కూళ్ల భవనాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. 5735 ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలో రూ.5 లక్షల చొప్పున కిచెన్‌ షెడ్ల వ్యయం రూ.287 కోట్లు, 1668 హైస్కూళ్లలో రూ.15 లక్షల చొప్పున కిచెన్‌ షెడ్ల వ్యయం రూ.250 కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి  ఎస్‌.ఎస్‌.రావత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడుతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top