పెండింగ్‌ నిధులు విడుదల చేయాలి

CM YS Jagan request to Union Home Minister Amit Shah About Pending funds - Sakshi

రాష్ట్ర విభజన, కరోనా మహమ్మారితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వినతి

విభజన చట్టం హామీల మేరకు నిధులు ఇవ్వాలి

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలి

కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తోనూ భేటీ

పోలవరం నిధులు త్వరగా విడుదల చేయాలని వినతి 

నదుల అనుసంధానంపై పరిశీలనకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ రెండో రోజు బుధవారం కూడా ఉదయం 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందాల్సిన సాయంపై పూర్తి వివరాలతో ఓ వినతి పత్రం అందజేశారు. అందులోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 

14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయండి
– కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడినందున స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.2,253.52 కోట్లును వెంటనే విడుదల చేయాలి.  
– రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద మొత్తం రూ.3,622.07 కోట్లను త్వరగా విడుదల చేయాలి.  

పోలవరం నిధులు విడుదల చేయాలి
– 2020 ఏప్రిల్‌ వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,016.07 కోట్లు ఖర్చు చేసింది. ఈ జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు రూ.8,507.26 కోట్లు మాత్రమే రీయింబర్స్‌ చేసింది. మిగిలిన రూ.4,006.43 కోట్లను వెంటనే విడుదల చేయాలి. 
– పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్న రూ.15 వేల కోట్లకుగాను పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరున నాబార్డ్‌ నేరుగా రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసేలా అనుమతించాలి.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవ్వాలి
– వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24,350 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(డీపీఆర్‌)ను ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. 
– ఏడు జిల్లాలకు ఆరేళ్లపాటు ఏటా రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.2,100 కోట్లు ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకు రూ.1,400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన రూ.700 కోట్లు వెంటనే ఇవ్వాలి.

ద్రవ్యలోటు భర్తీ చేయాలి
– 2014–15కు గాను రూ.22,948.76 కోట్లు ద్రవ్య లోటుగా లెక్కించి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే ద్రవ్య లోటుగా గుర్తించి, రూ.3,979.50 కోట్లు విడుదల చేసింది. 
– మిగిలిన రూ.138.39 కోట్లు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన మిగిలిన రూ.18,830.87 కోట్లను కూడా సానుకూల దృక్పథంతో పరిశీలించి విడుదల చేయాలి.
– ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి 2013–14 నుంచి 2016–17 వరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సబ్సిడీ రూ.1,600 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖను ఆదేశించాలి.
– కొత్త రాజధాని కోసం రూ.49,924 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మాత్రమే ప్రకటించి, రూ.1,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలి.

ఉపాధి హామీ నిధుల బకాయిలు చెల్లించాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉన్న “ఉపాధి’ నిధులు రూ.3,740.53 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అగ్రి క్లినిక్స్, ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్ల నిర్మాణాన్ని ఈ పథకం పరిధిలో చేర్చాలి.  
– పేదలకు ఇళ్ల కోసం కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన 174.91 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు కనీస ధర చెల్లిస్తుంది.
– డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ ప్రాజెక్టు కింద సమగ్ర భూసర్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖ ఇస్తామన్న రూ.202.09 కోట్లు వెంటనే విడుదల చేయాలి.  

త్వరితగతిన పోలవరం చెల్లింపులు
– పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధుల్లో తిరిగి చెల్లించాల్సిన వాటిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించిన రూ.2,234.87 కోట్లకు ఆమోదం తెలిపి, ఆర్థిక శాఖకు సదరు ప్రతిపాదనలు పంపినందుకు కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరో రూ.1,771.39 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ త్వరితగతిన విడుదలయ్యేలా చూడాలని కోరారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.  
– పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. మార్చిలోగా రూ.18 వేల కోట్లను విడుదల చేయాలని వి/æ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస చెల్లింపులను కూడా వేగవంతం చేయాలన్నారు.
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిపాదిత గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును సందర్శించేందుకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ వెదిరె శ్రీరామ్‌ను వచ్చే వారం పంపాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. గోదావరి–పెన్నా–కావేరి ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ వ్యయాన్ని భరించాలని కోరారు.  
– ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కమిటీ సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top