ఏపీలో కొత్త చరిత్ర

CM YS Jagan Launches YSR Rythu Bharosa Second Installment - Sakshi

ఏ సీజన్‌ పంట నష్ట పరిహారం ఆ సీజన్‌లోనే  

రెండో ఏడాది రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా

సొమ్ము విడుదల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌

50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,115 కోట్లు జమ

1.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ  

అక్టోబర్‌లో పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోగా పరిహారం  

అర కోటి మందికి పైగా రైతులకు ఈ ఏడాది దాదాపు రూ.6,800 కోట్ల సాయం

రాష్ట్రంలోని ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఏటా రూ.13,500

కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన

గిరిజన రైతులు, అసైన్డ్‌ భూముల రైతులకూ రైతు భరోసా

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మాం. దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు ఏటా రూ.13,500 ఇచ్చిన దాఖలాలు లేవు. అది మన రాష్ట్రంలోనే ఉంది. రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని కొందరు.. ఈ నెల 16న వర్షాలు ముగిసినా, 10 రోజుల తర్వాత ట్రాక్టర్‌కు పూలు కట్టి మరీ పర్యటిస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంచిగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. దీనికితోడు ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సాయంతో రైతులు పంటలు బాగా పండించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ ఖరీఫ్‌ సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇదే సీజన్‌లో ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే పంట నష్టపరిహారం చెల్లించామని గర్వంగా చెబుతున్నామన్నారు. అక్టోబర్‌ నెలలో వరదలు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోగా పరిహారం ఇస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ కింద రెండో ఏడాది రెండో విడత చెల్లింపులను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1,115 కోట్లు జమ చేశారు. అలాగే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో చెల్లిస్తూ.. 1.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్లు జమ చేశారు.

కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కు పత్రాలు పొంది సాగుకు సిద్ధమైన రైతులకు కూడా రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకాన్ని వర్తింప చేశారు. ఆ మేరకు ఈ ఏడాది రెండు విడతలకూ కలిపి రూ.11,500 చొప్పున 1.02 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.118 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వివిధ జిల్లాల్లోని రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు తనకిచ్చారన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఈ ఏడాది అర కోటికి పైగా రైతులకు దాదాపు రూ.6,800 కోట్లు సహాయంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఇళ్లుంటే, వాటిలో 50 లక్షల ఇళ్లకు.. అంటే మూడో వంతు ఇళ్లకు మేలు కలిగేలా పెట్టుబడి సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
రైతులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు కన్నబాబు, సుచరిత, వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు 

రైతులకు మెరుగైన భద్రత
– మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు గత ఏడాది ఇచ్చాం. ఈ ఏడాది 50.47 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాం.  
– దేశ చరిత్రలోనే రైతులకు మెరుగైన భద్రత, ఉపాధి మన రాష్ట్రంలో లభిస్తోంది. రైతు భరోసా కింద ఇచ్చిన హామీ కంటే మిన్నగా, రూ.12,500 బదులు రూ.13,500 ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులకు, అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సాయం చేస్తున్నాం. 
– గతంలో ఏనాడూ అదే (సేమ్‌) సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. 2018లో నష్టానికి పరిహారం పూర్తిగా ఎగ్గొట్టారు.

రైతుల మేలు కోసం ఎన్నెన్నో..
– 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం. 
– వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోరు బావుల తవ్వకంతో పాటు పేద రైతులకు మోటార్లను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. 
–  రైతుల ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,655 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల సబ్సిడీ రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,046 కోట్లు చెల్లించాం.
– ఫీడర్ల సామర్థ్యం పెంచాం. పంటల బీమా ప్రీమియమ్‌ రూ.1,030 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ఏడాది రూ.15 వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు చేశాం. రూ.3,200 కోట్లతో వివిధ పంటలు కొనుగోలు చేశాం.  

చరిత్ర సృష్టిస్తున్నారు
ఇది చరిత్రాత్మక రోజు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి ఇదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీని కేవలం మీరు (వైఎస్‌ జగన్‌) మాత్రమే ఇస్తున్నారు. కరోనా సమయంలోనూ ఏదీ ఆపడం లేదు. రాష్ట్రంలో హరిత విప్లవం సాధిస్తున్నారు. 
– కె.కన్నబాబు. వ్యవసాయ శాఖ మంత్రి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top