సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చింది: సీఎం జగన్‌

CM YS Jagan Comments On BC Sankranthi Sabha At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : మహిళా అభ్యుదయంలో మరో  చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్‌ పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అననంతరం సీఎం మాట్లాడుతూ.. ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. చదవండి: బీసీ సంక్రాంతి సభ ప్రారంభం..

‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశాం. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎన్నికల మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తాను. అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మెనార్టీ వర్గాలకు చెందినవారే. కేబినెట్‌ కూర్పులో  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చాం. శాసనసభ స్పీకర్‌ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. 4 రాజ్యసభ సీట్లలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాం.’ అని తెలిపారు.

కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి
‘నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. రాకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాల ప్రసక్తి లేకుండా అర్హులందరికీ సంక్షేమం అందాలి. ఆ బాధ్యతను మీరందరూ స్వీకరించాలి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. 18 నెలల్లోనే 90శాతానికి పైగా హామీలను నెరవేర్చాం. టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీలకు చేసిందేమీలేదు. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా బీసీలకు రూ.6140 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. సున్నా వడ్డీ పథకం ద్వారా 7.14 లక్షల బీసీ కుటుంబాలకు లబ్ది. ఈనెల 25న 31లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. 15 రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. కోర్టు అనుమతి రాగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘జగనన్న చేదోడు కింద 2.98 లక్షల మందికి రూ.298 కోట్లు అందించాం. ఆరోగ్యశ్రీతో 5.24 లక్షల మంది బీసీ కుటుంబాలకు లబ్ది జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కింద 18 నెలల్లో రూ.25వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్ఆర్‌ పెన్షన్‌తో 61.94 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 90.37 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అందించాం. ఆసరా, చేయూత పథకాలతో అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం విద్యాదీవెనతో 18.57 లక్షల మందికి రూ.3857 కోట్లు అందించాం. విద్యా కానుక పథకానికి రూ.648 కోట్లు ఖర్చు చేశాం. 42.34లక్షల మందికి లబ్ది. గోరుముద్ద పథకంతో 32.52 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో 30.16లక్షల మందికి లబ్ధి చేకూరింది. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపురేఖలను పూర్తిగా మార్చుతున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top