ఆర్బీకేలతో ఆక్వా ల్యాబ్‌ల అనుసంధానం 

CM Jagan Says Integration of Aqua Labs with Rythu Bharosa Centres - Sakshi

సీడ్, ఫీడ్‌ విషయంలో ఎక్కడా కల్తీకి ఆస్కారం ఇవ్వకూడదు

పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లను బాగా ఉపయోగించుకోవాలి  

చేపలు, రొయ్యల వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలి 

అటు రైతులు, ఇటు వినియోగదారులకు మేలు జరగాలి 

ఈ లక్ష్య సాధన కోసమే ఆక్వా హబ్‌ల ఏర్పాటు  

వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలి 

కేజ్‌ ఫిష్‌ కల్చర్‌ (నీళ్లపై తేలే తొట్టెలలో చేపల పెంపకం), మారీకల్చర్‌ (నిర్దిష్ట వాతావరణంలో చేపల పెంపకం)పై దృష్టి పెట్టాలి. వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయి. కేజ్‌ ఫిష్‌ కల్చర్‌కు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయండి. దీనిపై రైతులు, ఔత్సాహికులు కలిసి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పేదవాడు లాభపడేలా ఈ ప్రణాళిక ఉండాలి. పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్, 3 చోట్ల మారీకల్చర్‌ను మొదలు పెట్టాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విస్తరించాలి.  

ఆర్బీకే కియోస్కుల్లో పశు దాణా తదితర ఉత్పత్తులన్నింటినీ అందుబాటులో ఉంచాలి. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు మంచి స్పందన వస్తున్నందున వాటి ద్వారా రైతులతో నేచురల్‌ ఫార్మింగ్‌ (సహజ వ్యవసాయం)ను ప్రోత్సహించాలి.  
 – సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల గురించి బాగా ప్రచారం చేయడంతో పాటు వాటిని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ల్యాబ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీడ్, ఫీడ్‌ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్‌ ఎలా చేయించుకోవాలన్న దానిపై అందరికీ సమాచారం తెలియాలని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖల కార్యకలాపాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 35 ల్యాబ్‌లలో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్‌లు నవంబర్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ల్యాబ్‌ల వల్ల నాణ్యమైన సీడ్, ఫీడ్‌ అందుతుందని.. తద్వారా ఇటు రైతులు, అటు వినియోగదారులకు క్వాలిటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ దిశగా రైతులకు.. వినియోగదారులకు మేలు చేయడానికే ఆక్వా హబ్‌లను కూడా తీసుకువచ్చామని స్పష్టం చేశారు.  

మత్స్య మార్కెట్‌ విస్తరించాలి 
రాష్ట్రంలో చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలని, వీటిని సరసమైన ధరలకే ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే వీటిని ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. స్థానిక మార్కెట్‌ను విస్తరించడం వల్ల రైతులకు మంచి ధర అందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు ఆక్వా హబ్‌ల ఏర్పాటు, వాటికి అనుబంధంగా రిటైల్‌ దుకాణాలకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానికంగా ఏడాదికి 4.36 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్న చేపల వినియోగాన్ని 12 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆక్వా హబ్‌ల నుంచి రిటైల్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు చేరవేసేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..  
 
ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి 
► ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలి. భూ సేకరణ పనులుపై మరింత ధ్యాస పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలి.  
► రాష్ట్రంలో 7 ఫిషింగ్‌ హార్బర్లు, 5 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల ఏర్పాటులో భాగంగా 5 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలి. కేజ్‌ ఫిష్‌ కల్చర్, మారీకల్చర్‌పై కూడా దృష్టి సారించాలి.  
 
వెటర్నరీ డిస్పెన్సరీలు 
► వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలి. ప్రతి గ్రామంలో ఏముండాలి? మండల కేంద్రంలో ఏముండాలి? అన్నది నిర్ధారించాలి. గ్రామం, మండలం, నియోజకవర్గ స్ధాయిలో ఏయే డిస్పెన్సరీలు ఉండాలన్న దానిపై హేతుబద్ధత ఉండాలి. దానిపై కార్యాచరణ రూపొందించాలి. తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలి. 
► మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కావాల్సిన డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై పటిష్టంగా మ్యాపింగ్‌ చేయాలి. 
► ప్రజా వైద్యానికి సంబంధించి మనం ఒక ప్రొటోకాల్‌ అనుసరిస్తున్నాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు, నలుగురు వైద్యులు, రెండు అంబులెన్స్‌లు పెట్టాలన్న విధానంతో ప్రజారోగ్య రంగంలో ముందుకు పోతున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రకారం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఇలాంటి హేతుబద్ధత, పటిష్టమైన వ్యవస్ధ పశు సంవర్థక శాఖలో కూడా ఉండాలి. 
 
పశువుల ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు  
► రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలి. నాడు–నేడులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందుగా నిర్ధారించుకోవాలి.  
► ఏయే రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలి. తర్వాత పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. 
► ఏపీ అమూల్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాల వెల్లువ ప్రారంభమైందని, ఆగస్టులో విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. 
► ఈ సమీక్షలో పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top