నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగ సభ | CM Revanth Reddy to Visit Palamuru on November 30: Telangana | Sakshi
Sakshi News home page

నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగ సభ

Published Sat, Nov 30 2024 4:15 AM | Last Updated on Sat, Nov 30 2024 10:48 AM

CM Revanth Reddy to Visit Palamuru on November 30: Telangana

హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

లక్షమంది రైతులు వస్తారని అంచనా 

సాంకేతిక కారణాలతో నిలిచిన రూ.2 లక్షలు.. ఆపై రుణమాఫీ నిధులు విడుదల చేసే అవకాశం  

రైతు భరోసాపైనా శుభవార్త చెబుతారని అన్నదాతల్లో ఆశలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తికానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు చేపట్టిన రైతు పండుగ సదస్సుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ.. నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాలొంటారు.

సీఎం రాక ఇలా.. : సీఎం రేవంత్‌ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన స్వగృహం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 3:30 గంటల వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌కు వస్తారు. సమీపంలోని రైతు పండుగ సదస్సుకు చేరుకొని స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం నాలుగున్నర గంటలకు బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు మరికొందరు మంత్రులు సైతం సదస్సుకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ ముగిశాక సాయంత్రం ఆరుగంటలకు తిరుగు పయనమై హైదరాబాద్‌లోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.  

భారీగా రైతుల సమీకరణ.. 
బహిరంగసభకు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి ఆర్టీసీ 657 బస్సులను కేటాయించింది. వీటితోపాటు ప్రైవేట్‌ బస్సులు, జీబులు తదితర వాహనాల్లో రైతులు తరలిరానున్నారు. సుమారు లక్ష మంది వస్తారనే అంచనాతో బహిరంగసభకు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

రుణమాఫీ, రైతు భరోసాపై ఆశలు.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాలతో జాబితా రూపొందించగా.. దీంతోపాటు రైతు భరోసా నిధుల విడుదలపై రైతు పండుగవేళ సీఎం శుభవార్త అందిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా పంట రుణాలను మాఫీ చేస్తామని.. అయితే రూ.2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మిగతా మొత్తాన్ని రైతులు భరించాలని ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీపై రేవంత్‌రెడ్డి ప్రకటన చేయొచ్చనే ఆకాంక్ష అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement