పంటలు కాపాడుకునేందుకే ముందుగా సాగునీరు | Sakshi
Sakshi News home page

పంటలు కాపాడుకునేందుకే ముందుగా సాగునీరు

Published Thu, Jun 2 2022 4:22 AM

CM Jagan On Irrigation Water For Farmers - Sakshi

సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టుకు సాగునీటిని ముందుగా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారమే గోదావరి డెల్టాకు ఖరీఫ్‌ సాగుకు నీటిని విడుదల చేశామని గతంలో ఇది ఎప్పుడూ జరగలేదన్నారు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం స్పందన సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ...


షెడ్యూల్‌ ప్రకారం నీటి విడుదల..
జూన్‌ 10న కృష్ణాడెల్టాకు, గుంటూరు చానల్‌కు, గండికోట కింద, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు కింద పంట భూములకు సాగునీరు ఇస్తున్నాం. ఎస్సార్‌బీసీ కింద గోరకల్లు, అవుకుకు జూన్‌ 30న సాగునీరు ఇస్తున్నాం. ఎన్‌ఎస్‌పీ కింద జూలై 15న నీటిని విడుదల చేస్తున్నాం. ఈ షెడ్యూల్‌ ప్రకారం నీటిని విడుదల చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.

వ్యవసాయ సలహా మండళ్లు...
వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. ఆర్బీకే స్థాయిలో తొలి శుక్రవారం, మండలస్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ కృషి చేయాలి. పంటల ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి. 

పారదర్శకంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ 
ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాల పంపిణీ పారదర్శకంగా జరగాలి. నాణ్యతకు మనం భరోసాగా ఉండాలి. పరీక్షించి రైతులకు అందించాలి. జూన్, జూలైలో ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి. ఆమేరకు అందుబాటులో ఉంచాలి. డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

ప్రతి నెలా బ్యాంకర్ల సమావేశాలు 
ప్రతి నెలా జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించాలి. రైతులకు రుణాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌లో దాదాపు రూ.92 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ మేరకు అందించాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కౌలురైతు సీసీఆర్సీ కార్డులు పొందాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలి.

సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ సాగు విధానాలపై ఐరాసకు ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ)తో ఒప్పందం చేసుకుంది. సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలి. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. దేశంలోనే తొలిసారి సహజ పద్ధతుల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ చేపట్టాం. 

జాతీయ రహదారులకు వేగంగా భూ సేకరణ..
రాష్ట్రంలో పలు రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో అనుసంధానిస్తూ 2,400 కి.మీ. మేర రోడ్లకు రూ.6,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 3,079 కి.మీ.కి సంబంధించి రూ.29,249 కోట్ల విలువైన మరో 99 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. 2,367 కి.మీ.కి సంబంధించి రూ.29,573 కోట్లతో మరో 45 ప్రాజెక్టులు డీపీఆర్‌ దశలో ఉన్నాయి.

బెంగళూరు –విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు సంబంధించి 332 కి.మీ రోడ్ల నిర్మాణ పనులను రూ.17,500 కోట్లతో చేపడుతున్నాం.  భూ సేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. దాదాపు రూ.80 వేల కోట్లకు పైబడి పనులు చేపడుతున్నాం. ఈ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర జీఎస్‌డీపీ గణనీయంగా పెరగుతుంది. వీలైనంత త్వరగా భూములను కలెక్టర్లు సేకరించాలి. అత్యంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి.

రోడ్ల వివరాలతో ఫొటో గ్యాలరీలు..
రూ.2,500 కోట్లతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్‌ రోడ్ల కోసం సుమారు రూ.1,072.92 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.1,400 కోట్లు కూడా ఇవ్వలేదు. నాడు– నేడు కింద అభివృద్ధి చేసిన రోడ్ల వివరాలను ప్రజలకు తెలియచేస్తూ ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలి.

సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ
ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌ భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌పై కార్యాచరణ సిద్ధం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.ప్రాధాన్యత ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 

Advertisement
 
Advertisement