ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్‌

CM Jagan Gives B Form To YSRCP MLC Candidates At Amaravati - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), ఇసాక్‌ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప) ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్‌ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్‌కు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

పాలవలస కుటుంబంలో మూడో తరం నేత
ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్‌.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్‌ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.

పేరు: పాలవలస విక్రాంత్‌
పుట్టిన తేదీ: 23–12–1971
చదువు: బీఈ
తండ్రి: పాలవలస రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్‌ 
తల్లి: ఇందుమతి, రేగిడి జెడ్పీటీసీ
భార్య: గౌరీ పార్వతి, పాలకొండ జెడ్పీటీసీ
పిల్లలు: సాయి గణేష్, మణికంఠ కార్తికేయ
పదవులు: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌

రవాణా శాఖ అధికారిగా సేవలందించి..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వైఎస్సార్‌ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్‌ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది. 

పేరు: దేవసాని చిన్న గోవిందరెడ్డి
పుట్టినతేదీ: 23.02.1956
విద్యార్హత: ఎంటెక్, ఐఐటీ మద్రాస్‌
భార్య పేరు: తులసమ్మ
కుమారులు: గోపీనాథ్‌రెడ్డి, ఆదిత్యానాథ్‌రెడ్డి
కుమార్తె: డాక్టర్‌ సుష్మ, అల్లుడు రమేష్‌రెడ్డి, ఐపీఎస్‌ అధికారి

మైనార్టీ నేతగా.. 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పేరు: ఇసాక్‌బాషా 
పుట్టిన తేదీ: 4–6–1962 
చదువు: బీకాం 
తల్లిదండ్రులు: జాఫర్‌ హుస్సేన్, జహ్నాబీ 
భార్య: రహ్మద్‌ బీ (గృహిణి) 
పిల్లలు: ఫిరోజ్‌ బాషా, హర్షద్‌ 
పదవులు: గతంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top