సత్వర న్యాయమే లక్ష్యం: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

CJI NV Ramana CM Jagan inaugurated new court complex Vijayawada - Sakshi

విజయవాడలో బహుళ కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ 

న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టం 

240 మంది న్యాయమూర్తులు, 15 హైకోర్టులకు సీజేలను నియమించా  

సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లకు శిక్షణ ఇవ్వాలి.. నా ఎదుగుదలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు  

న్యాయ వ్యవస్థకు ప్రభుత్వ సహకారం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దేశంలోని న్యాయ స్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా న్యాయవాదులు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని, ఆ పరిస్థితి తలెత్తకుండా న్యాయ వ్యవస్థ వనిచేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం ఆయన విజయవాడ సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం శుభపరిణామం.. అందువల్ల నేను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితం’ అంటూ సీజేఐ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తవ్వడానికి ఆలస్యమైందన్నారు. అయితే మళ్లీ తన చేతుల మీదుగానే ఈ భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న తన ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించకపోయినా.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారని అభినందించారు. విజయవాడతో, బెజవాడ బార్‌ అసోíసియేషన్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.  
విజయవాడ సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ,  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు 

న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం 
సమాజంలో మార్పు కోసం అపార అనుభవం గల సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని జస్టిస్‌ ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతికి, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన పదవీ కాలంలో 240 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామని గుర్తు చేశారు. ఈ నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. రూ.55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ.100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులకు, పెద్దలరికీ ఆయన అభినందనలు తెలిపారు. విశాఖలో పెండింగ్‌లో ఉన్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సీఎం సహకారం అందించాలని సీజేఐ కోరారు.   
భవన సముదాయంలో ఓ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇది అరుదైన ఘట్టం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి 2013లో జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే భవన సముదాయాన్ని ఆయనే ప్రారంభించడం అరుదైన ఘట్టమని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. విజయవాడలో అధునాతన భవనంలో కోర్టులు ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్‌ ఏర్పాటుతో కేసుల విచారణలో వేగం పెరుగుతుందని, పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
నూతన కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న సీజేఐ, హైకోర్టు సీజే, సీఎం 
ఇదిలా ఉండగా, కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ను సన్మానించాలని సభ్యులు చేసిన అభ్యర్థనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞులైన జస్టిస్‌ ఎన్వీ రమణను సత్కరించడం సముచితమని వారికి సూచించారు. వేదికపై ఈ సన్నివేశాన్ని గమనించిన న్యాయవాదులు సీఎం నిరాడంబరతను ప్రశంసించారు. సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు.

సీజేఐని గజమాలతో సత్కరించినప్పుడు వేదికపై సీఎం.. అందరిలో ఒక్కడిగా కలిసిపోయి సూచనలు ఇచ్చిన తీరును కరతాళ ధ్వనులతో అభినందించారు. కాగా, తొలుత కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ బి.దేవానంద్, జస్టిస్‌ కృపాసాగర్, జస్టిస్‌ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ విష్ణువర్ధన్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top