
పోలీసుల సమక్షంలో జేసీబీతో వేపచెట్టు, రచ్చబండ ఆనవాళ్లను తొలగిస్తున్న దృశ్యం
కొండపి మండలం జాళ్లపాలెంలో సీఐ సోమశేఖర్ ఓవరాక్షన్
ఒంగోలు, టాస్క్‌ఫోర్స్: కోర్టులో వివాదం నడుస్తున్నా.. పచ్చనేత ఆదేశంతో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను పోలీసులు రాత్రికి రాత్రే కూల్చేశారు. ఇదేమిటని నిలదీసిన గ్రామస్తులపై సీఐ సోమశేఖర్ రెచ్చిపోయారు. తుపాకీ చూపిస్తూ ‘కాల్చిపడేస్తా నా కొడకల్లారా’ అంటూ బెదిరించారు. రచ్చబండ తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులపై లాఠీచార్జి చేశారు. దీంతో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. సర్వే నంబర్ 627లో 50 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి 20 మంది హక్కుదారులుగా ఉన్నారు. స్థలంలో 20 ఏళ్ల క్రితం వేపచెట్టు చుట్టూ రచ్చబండ నిర్మించి గ్రామస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ స్థల వివాదం హైకోర్టుకు చేరగా.. టీడీపీ సానుభూతిపరుడు మంత్రి స్వామిని ఆశ్రయించాడు. దీంతో మంగళవారం రాత్రి 30 మంది పోలీసులతో వచ్చిన సీఐ సోమశేఖర్ జేసీబీ సహాయంతో రచ్చబండను తొలగించారు.
అడ్డుకునే ప్రయత్నం చేసిన గ్రామస్తుల్ని సీఐ సోమశేఖర్ కాల్చిపారేస్తా నా కొడకల్లారా అంటూ పిస్టల్ చూపించి బెదిరించారు. మహిళలపై లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాగా.. గాయపడ్డ వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి సీసీ కెమెరాను సైతం పోలీసులు పగులగొట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.