TTD: 25 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శన టికెట్లు

Chittoor: TTD Release Sri Vari Special Darshanam Tickets In Online - Sakshi

సాక్షి, చిత్తూరు: ఈనెల 25వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వనున్నారు.

సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు  ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం వస్తుండడంతో కరోనా వ్యాప్తి అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు.

చదవండి: ‘పరిషత్‌’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top