తెలిసీ తెలియక.. ఇంటిని విడిచివెళుతున్నారు!

Childline Records 229 Children Escaped From Home Vizianagaram - Sakshi

తల్లిదండ్రులు మందలించారని కొందరు..  

పట్టణాలు చూద్దామంటూ మరికొందరు..  

మూడేళ్లలో ఇల్లు విడిచి పారిపోయిన పిల్లల సంఖ్య 229 మంది  

వారిని ఆదుకుంటున్న చైల్డ్‌లైన్‌ ఫోరం  

మెంటాడ మండలానికి చెందిన పదేళ్ల బాలిక విజయనగరం చూద్దామని బస్సుఎక్కి సోమవారం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 1098కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. చైల్డ్‌లైన్‌ సిబ్బంది వెంటనే బాలికను కార్యాలయానికి తీసుకొచ్చారు. వివరాలు సేకరించి రక్షణ కల్పించారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తల్లికి అప్పగించారు.  

విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు మందలించారని ఈనెల 10వ తేదీన బస్సులో విజయనగరం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వారు బాలికను సంరక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.  

మక్కువకు చెందిన  చెందిన 14 ఏళ్ల బాలుడు  కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల కిందట రైలులో ముంబయి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులు బాలుడిని విచారించి మక్కువ ప్రాంతంగా గుర్తించారు. విజయనగరం పోలీసులకు సమాచారం అందించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.  

విజయనగరం ఫోర్ట్‌:  తెలిసీతెలియని వయసులో పిల్లలు క్షణికావేశానికి లోనవుతున్నారు. కొందరు ఇంటిని విడిచిపెడుతున్నారు. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, పట్టణాలు చూసొద్దామని, స్నేహితులపై మోజుతో.. ఇలా వేర్వేరు కారణాలతో చిన్నవయసులో ఇంటి నుంచి పారిపోతున్నారు. రైలు, బస్సు ల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో అనాథులుగా తిరుగుతున్నారు. ఆ సమయంలో పోలీసులకు, చైల్డ్‌లైన్‌ సభ్యులకు తారసపడిన వారు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. పొరపాటున అగంతుకులకు చిక్కితే అంతే సంగతి. మూడేళ్లలో జిల్లాకు చెందిన 229 మంది చిన్నారులు ఇళ్ల నుంచి పారిపోయి పోలీసులు, చైల్డ్‌లైన్‌ సిబ్బంది సహకారంతో తిరిగి ఇంటికి చేరినట్టు రికార్డులు చెబుతున్నాయి.

పిల్లల పెంపకంపై శ్రద్ధ అవసరం  
చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాఇష్టాలను తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై పిల్లల ప్రవర్తనను గమనించడంలేదు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలు చిన్న పొరపాటు చేసినా, చదువులో వెనుకబడినా కోపం ప్రదర్శిస్తున్నారు. గట్టిగా మందలిస్తుండడంతో పిల్లలు బెదిరిపోయి ఇంటిని విడిచిపెడుతున్నట్టు పోలీస్‌ అధికారులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి 
పిల్లల ప్రవర్తను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి ఆసక్తులను తెలుసుకోవాలి. కోపపడడం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడులు గురించి పెద్దలు చెప్పేవారు. ఓదార్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్‌

ఆదర్శంగా జీవించాలి..  
తల్లిదండ్రులు ఆదర్శంగా జీవిస్తే పిల్లల్లో మంచి నడవడిక అలవడుతుంది. అలాకాకుండా చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవకు దిగుతున్నారు. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రేరేపిస్తోంది. సోషల్‌ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్‌ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – జి.హైమావతి, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top