పరిహారం అడిగితే.. ఊరు దిగ్బంధం | Chandrababu government unfair to Farmers in The Name of development | Sakshi
Sakshi News home page

పరిహారం అడిగితే.. ఊరు దిగ్బంధం

Apr 27 2026 5:24 AM | Updated on Apr 27 2026 5:24 AM

Chandrababu government unfair to Farmers in The Name of development

విశాఖ జిల్లా తర్లువాడలో రైతుల భూముల్ని చదును చేస్తున్న దృశ్యం

అభివృద్ధి ముసుగులో అన్నదాతకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం

గూగుల్‌ డేటా సెంటర్‌కు భూములు లాక్కున్న సర్కార్‌

వందలమంది రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపనకు ఏర్పాట్లు 

విశాఖ జిల్లా తర్లువాడలో 144 సెక్షన్‌ విధించి.. రైతుల గొంతునొక్కుతున్న సర్కారు

నిరసన వ్యక్తం చేయకుండా, పరిహారం అడగకుండా నిర్బంధం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది. అన్నదాతల నోట్లో మట్టి కొడు­తో­ంది. న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికా­రంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూము­లు తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే, తమ ఊరినే దిగ్బంధించారని విశాఖజిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఏళ్ల తరబడి భూమినే నమ్ముకుని బతుకుతున్న వందలాదిమంది తర్లువాడ డీ–­పట్టా, జిరాయితీ రైతుల ఉసురు పోసుకుంటూ మంగళవారం ‘గూగుల్‌ డేటా సెంటర్‌’ శంకుస్థా­పనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టు­కు­న్నారు. మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. నమ్మిన రైతుల్ని నట్టేట ముంచేస్తూ.. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా వారి భూములను బలవంతంగా లాక్కుంది. 

కనీస నష్ట­పరిహారం ఊసే ఎత్తకుండా, పోలీసుల పహారాలో భూ­సేకరణ చేయడంపై స్థానికులు మండిపడు­తు­న్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో ప్రభు­త్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. శంకుస్థా­ప­నకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో.. తర్లువా­డని ఖాకీలు నిర్బంధిస్తూ.. 144 సెక్షన్‌ విధించారు. రైతులకు అండగా నిలబడేందుకు వస్తున్న ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకుంటున్న భూమిని అప్పనంగా లాక్కోవడమే కాకుండా, పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. 

కప్పదాటు హామీలు
ఆనందపురం మండలం తర్లువాడలో కొందరు రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చిన సర్కార్, దశాబ్దాలుగా డీ పట్టా భూముల్ని సాగు చేసుకుంటున్న 520 మంది రైతులకు మాత్రం పైసా పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంది. అలాగే 12 ఎకరాల జిరాయితీ భూములను సాగుచేసుకుంటున్న మరో 6 కుటుంబాలకు కూడా మొండిచేయి చూపింది. గూగుల్‌ వచ్చిన తొలి నాళ్లలో రైతులందరికీ తగిన పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు తరఫున భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు ప్రజలకు నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటను గాలికి వదిలేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిరాయితీ భూములు ఉన్న వారికి నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా.. ఒక్కొక్క ఎకరం డీ పట్టా భూములున్న 520 మంది రైతులకు 5 సెంట్లు భూమి, రూ.5 లక్షలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేదు లేదు... 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ఆ రెండింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసి... ఇప్పుడు బలవంతపు భూ సేకరణకు ఉపక్రమించింది. 

పరిహారం అడిగితే బెదిరిస్తున్నారు
మా కుటుంబంలోని ముగ్గురికి 60 ఏళ్ల క్రితమే తర్లువాడలో 4.64 ఎకరాల పట్టా భూమి ఉంది. దాని చుట్టూ 1.61 ఎకరాల బంజరు భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల బంజరు భూమిలో చెట్లను తొలగించి రోడ్డు వేశారు. బంజరు భూములకు పరిహారం అడుగుతున్నాం. జిరాయితీ భూములను కూడా డి. పట్టా భూముల తరహాలోనే ప్రభుత్వానికి ఇచ్చేయమని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే న్యాయస్థానం ద్వారా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు.  మేము జిరాయితీ భూములకు అదే విలువ గల భూమి అడుగుతున్నాం. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.
– బి.వెంకటేశ్వరరావు, తర్లువాడ రైతు

భూమి పూజ చేసినా.. ఆందోళన కొనసాగిస్తాం
బంజరు భూములు అభివృద్ధి ప«థకంలో భాగంగా 2001 లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బలహీన వర్గాల మహిళలకు ఎకరం వంతున భూమి ఇస్తే అందులో మొక్కలు వేసుకున్నాం. సాగు ఫలాలు దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ఈ భూములు కావాలని ప్రభుత్వం అడిగింది. తొలుత..భూములకు ప్రతిఫలంగా 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు పరిహారం కావాలని ఆందోళన చేస్తుంటే.. నిరసనలు తెలపకూడదంటూ  మా ఊరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. గూగుల్‌కు భూమి పూజ జరిగిన తర్వాత కూడా.. రైతులందరం కలిసి ఆందోళనలను కొనసాగిస్తాం.
– బాలి సూరమ్మ, తర్లువాడ

Advertisement
 
Advertisement
Advertisement