నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే ! | Chandrababu Benami Lingamaneni as Jana Sena Rajya Sabha MP candidate | Sakshi
Sakshi News home page

నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే !

Jun 6 2026 4:51 AM | Updated on Jun 6 2026 4:51 AM

Chandrababu Benami Lingamaneni as Jana Sena Rajya Sabha MP candidate

జనసేన అభ్యర్థిగా చంద్రబాబు బినామీ లింగమనేని 

టీడీపీ సొంత మనిషికి రాజ్యసభ సీటు ఇచ్చిన పవన్‌  

4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 3, జనసేనకి 1 

లింగమనేని అభ్యర్థిత్వంతో నాలుగూ టీడీపీకేనని విమర్శలు  

మూడు సీట్లకు టీడీపీలో భారీ లాబీయింగ్‌.. సానా, కిలారు, చింతకాయల విజయ్‌కి ఖరారు! 

నేడో, రేపో ప్రకటించనున్న సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి భర్తీ అవుతున్న నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతా­లో పడ్డాయి. అధికారికంగా మూడు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకి కేటాయించుకున్నారు. కానీ, జనసేన అభ్యర్థిగా చంద్రబాబుకు బినామీ­గా ప్రచారంలో ఉన్న లింగమనేని రమేష్ ని ఎంపిక చేయడంతో నాలుగు స్థానాలూ టీడీపీయే తీసుకున్నట్లయిందని రాజకీయ వర్గా­ల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తులో భాగంగా నాలుగింటిలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీ చెరొక స్థానం పంచుకోవాల్సి ఉంది. 

కానీ, కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తమకు 3 సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీని ఒప్పించి టీడీపీకి చంద్రబాబు మూడు స్థానాలు కేటాయించుకున్నారు. గతంలో భర్తీ అయిన 4 స్థానాల్లో బీజేపీ రెండు తీసుకోవడంతో మిగిలిన ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున తన మనిషిని అభ్యర్థిగా పెట్టి మొత్తం నాలుగింటిని టీడీపీకే దక్కేలా చేసుకున్నారు.  

టీడీపీలో భారీ లాబీయింగ్‌ 
టీడీపీకి దక్కనున్న మూడు స్థానాల కోసం ఆ పార్టీలో పెద్దఎత్తున లాబీయింగ్‌ జరుగుతోంది. సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కి ఆ పదవి రెన్యువల్‌ చేయడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు స్థానా­ల­కు మంత్రి నారా లోకేశ్‌ అనుయాయుడు కిలారు రాజేష్, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ పేర్లు గట్టి­గా వినిపిస్తున్నాయి. రాజేష్, విజయ్‌ పేర్లు ఖరారైనట్లు శుక్రవారం అంతా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో భాష్యం రామకృష్ణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తన మద్దతుదారులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడా­నికి ప్రయత్నించినట్లు తెలిసింది.

అయితే అక్కడున్న నేతలు ఆ­యనకు సర్దిచెప్పినట్లు సమాచారం. ఒకవేళ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు మార్చాలని చంద్రబాబు భావిస్తే బీసీ, ఎస్సీ నేతలకు అవకా­శం దక్కుతుందని చెబుతున్నారు. అందులో మ­హి­ళా నేతలు గుండా లక్ష్మీదేవి, సజ్జా హేమలత, ఉండవల్లి శ్రీదేవి పేర్లను పరిశీలించినా వారు ఆర్థికంగా టీడీపీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. 

తెలంగాణకు చెందిన డాక్టర్‌ దేవయ్య, కంభంపాటి రామ్మోహనరావు పేర్లను పరిశీలించినా చివరికి వారినీ పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. శుక్ర­వా­రం అర్థరాత్రి గానీ శనివారం గానీ అధికారికంగా ము­గ్గురు రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు ఖరా­రు చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తమకు రాజ్యసభ ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, గల్లా జయదేవ్, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.  

బాబు సొంత మనిషి.. ఇప్పుడు పవన్‌కి ఆప్తుడు
లింగమనేని రమేష్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉంటున్నా నిజానికి ఆయన చంద్రబాబు సొంత మనిషిగా, బినామీగా పేరు పడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట నివాసం ఆయనదే. రమేష్‌ దాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరాక పవన్‌ కళ్యాణ్‌తో సైతం రమేష్‌ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన్ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపాలని పవన్‌ నిర్ణయించారు. రమేష్‌ జన­సేన తరఫున ఎంపీ అయినా చంద్రబాబు జేబులో మనిషేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వ్యూహం ప్రకారమే రమేష్‌ జనసేన తరఫున రాజ్యసభ రేసులోకి వచ్చినట్లు సమాచారం. మొత్తంగా నాలుగు రాజ్యసభ స్థానాలను చేజిక్కించుకోవడానికి చంద్రబాబు పన్నిన వ్యూహం ఫలించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement