గుక్కెడు నీటి కోసం నానా కష్టాలు
మండే ఎండలో గంటల తరబడి కుళాయిల వద్ద పడిగాపులు
దాహార్తి తీర్చుకునేందుకు తోటల్లోని బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు
సమస్య పరిష్కారంపై కనీసం దృష్టి సారించని బాబు సర్కారు
గుక్కెడు నీటి కోసం బిందెలు పట్టుకుని వేచి చూస్తున్న వీరు అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని వెలిగొండ గ్రామ ఎస్సీ కాలనీవాసులు. గ్రామంలో నెల రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో వీరంతా అల్లాడిపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. మండు వేసవిలో తాగునీరు సరఫరా కాకపోవడంతో కూలి పనులకు కూడా వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము కష్టాలు పడుతున్నా అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ చీమ కుట్టినట్లయినా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వెలిగొండలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొంది. తాగునీటి సమస్యల పరిష్కారంపై చంద్రబాబు సర్కారు కనీసం దృష్టి సారించకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
రాయదుర్గం/కళ్యాణదుర్గం/బెళుగుప్ప/ఉరవకొండ రూరల్: మండు వేసవిలో పల్లెజనం అల్లాడిపోతున్నారు. దాహార్తి తీర్చుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. నెత్తిన బిందెలు పెట్టుకుని బావులు, వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రజల జీవనాడి అయిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేయడంతో నీటి కష్టాలు తారస్థాయికి చేరాయి.
పథకం కింద మూడు నియోజకవర్గాల్లో సుమారు 400 గ్రామాల్లో నీటి సరఫరా జరుగుతుండగా, 6 లక్షల మంది ఈ నీటిపైనే ఆధారపడ్డారు. అయితే, నీటిని సరఫరా చేసే పంపుహౌస్‌లలో పలు చోట్ల మోటార్లు కాలిపోవడం, మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడం, ఇంకొన్ని చోట్ల నిర్వహణ లోపం కారణంగా పైప్‌లైన్ లీకేజీలు వెరసి గ్రామీణులకు సరిగా నీరందడం లేదు. అసలే ఎండాకాలం, ఈ సమయంలోనే ఇలా జరగడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు
‘శ్రీరామరెడ్డి’ నీటితో పాటు మున్సిపాలిటీ నీరు కూడా సరిగా రాకపోవడంతో కళ్యాణదుర్గంవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. నీటి కోసం రోజుకు రూ.100 నుంచి రూ.150 దాకా ధారపోస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాటర్ మెన్లు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.


