అవినీతి కప్పెట్టడానికి తప్పుడు గణాంకాలు?
సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు
హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం
చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ
గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,684లేనని వెల్లడి
మంత్రి నారాయణ తప్పుడు లెక్కలు వల్లె వేశారంటున్న ఇంజినీరింగ్ నిపుణులు
వాస్తవానికి హ్యాపీనెస్ట్ కాంట్రాక్టు విలువ ప్రకారం చదరపు అడుగు వ్యయం రూ.4,958.30
గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్ చదరపు అడుగుకూ రూ.3,938.54 ఖర్చు
నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో మరి..!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో రాజధాని అమరావతిలో భవనాలు, రోడ్ల నిర్మాణ వ్యయం భారీగా పెంచేసి, అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు సర్కారు.. నీకింత నాకింత అంటూ పంచుకుతింటున్న తీరును సాక్ష్యాధారాలతోసహా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నారు. రాజధాని సెంట్రల్ సెక్రటేరియట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన వ్యయం సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల బండారం బట్టబయలైంది. దీంతో ఆ అక్రమాల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ యథాప్రకారం తప్పుడు లెక్కలు వల్లె వేశారు.
శనివారం రాజధాని ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగులపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ నివాస సముదాయాలకు రూ.984 కోట్లతో టెండర్ ఖరారైందని, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు కేవలం రూ.3,393 మాత్రమే అవుతోందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణానికి రూ.1,003 కోట్లతో టెండర్ ఖరారైందని, చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమే వ్యయం అవుతోందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.1,234 కోట్లతో టెండర్ ఖరారైందని, దాని నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945గా ఉందని మంత్రి వెల్లడించారు. దీనితో పోల్చి చూస్తే రాజధానిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్, గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కంటే తక్కువగా ఉందని వివరించారు.
అవినీతి బట్టబయలవడంతో బెంబేలు
సచివాలయం ‘శాశ్వత’ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58 వ్యయం చేస్తుంటే.. గ్రిహ 4–స్టార్, ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కోడ్(ఈసీఎస్‌బీసీ)– 2024 ప్రమాణాలతో కట్టే కేంద్రప్రభుత్వ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.5,587.44 మాత్రమే కేంద్రం మంజూరు చేయడంతో చంద్రబాబు సర్కార్ అవినీతి బట్టబయలైంది.
ఇక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.10 వేల నుంచి రూ.12 వేలు వ్యయం చేస్తుంటే.. గ్రిహ–4, ఈసీఎస్‌బీసీ–2024, ఎకో–నివాస్ సంహిత–2024 ప్రమాణాల ప్రకారం నిర్మించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు చదరపు అడుగుకు రూ.3,945.39 మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కారు అంచనా వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అవినీతి బట్టబయలవడంతో బెంబెలెత్తిపోయిన చంద్రబాబు సర్కారు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు లెక్కలు వల్లె వేస్తూ యథావిధిగా అబద్ధాలు చెబుతోంది.
తప్పు లెక్కలు చెబితే అక్రమం సక్రమమవుతుందా?
రాజధానిలో నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ప్లాట్లను హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తోంది. మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను రూ.856.31 కోట్లకు ఎన్‌సీసీ దక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్ వంటి సీనరేజీ పన్నుల రూపంలో రూ.153.05 కోట్లు సీఆర్‌డీఏ రీయింబర్స్ చేస్తుంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.1,009.36 కోట్లు. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి కాంట్రాక్టు విలువ రూ.4,689.48. హ్యాపీనెస్ట్ పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో! దీన్ని బట్టి చూస్తే హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయంపై మంత్రి నారాయణ చెప్పిన లెక్కలన్నీ తప్పేనన్నది స్పష్టమవుతోంది.
తప్పుడు లెక్కలు చెబితే అక్రమం సక్రమం అవుతుందా? కాదు కదా. ఈ చిన్న లాజిక్‌ను మరచిపోతే ఎలా అంటూ మంత్రి నారాయణను ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇక రాజధానిలో గెజిటెడ్ అధికారులకు నివాసాల కోసం ఎస్+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ప్లాట్లను 27,24,080 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్‌డీఏ చేపట్టింది. ఈ పనులను 2018లో రూ.707.40 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీకి అప్పగించింది. 2019 నాటికి రూ.389.11 కోట్ల విలువైన పనిని పూర్తి చేసింది. అంటే.. మిగిలిన పనుల విలువ రూ.318.29 కోట్లు. ఆ మేరకు బిల్లులు చెల్లించింది. కానీ.. 2024లో ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. మిగిలిన పనులను రూ.514.40 కోట్లకు అదే సంస్థకు గతేడాది అప్పగించింది.
మరో రూ.89.27 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఇక ఆ భవనాలకు ప్రహరి, ఎస్‌టీపీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు రూ.67.69 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచింది. పన్నుల రూపంలో మరో రూ.12.42 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. కాంట్రాక్టర్‌కు చెల్లించిన బిల్లులు, మిగిలిన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించిన విలువతో కలిపి నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.1,072.89 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.3,938.54కు చేరింది. పనులు పూర్తయ్యే సరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో?


