మృగాళ్లకు మరణ శాసనం

Campaign On Disha Act in Anganwadi Centers Andhra Pradesh - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘దిశ’ సేవలపై ప్రచారం

వేధింపులపై ఫిర్యాదులకు అత్యవసర ఫోన్‌ నంబర్ల ప్రదర్శన

సాక్షి, అమరావతి: బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేసే మృగాళ్లకు మరణ శాసనం తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ ల్యాబ్‌ వంటి అనేక పటిష్టమైన చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. దిశ బిల్లు అనంతరం మృగాళ్లపై తీసుకుంటున్న కఠిన చర్యలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంతోపాటు మహిళలను చైతన్యవంతం చేసేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసింది. 

అవగాహన కల్పిస్తున్న అంశాలివే..
► మహిళలు, బాలికల తక్షణ రక్షణ కోసం, వారిపై అకృత్యాలకు పాల్పడిన మృగాళ్లకు శిక్ష పడేలా వేగవంతమైన చర్యల కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విప్లవాత్మకంగా దిశ బిల్లు–2019 తీసుకొచ్చింది. 
► ఇందుకోసం దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, ల్యాబ్‌లు, కోర్డులు వంటివి ఏర్పాటు చేయడం జరిగింది.
► బాలలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లపై కేసు నమోదు చేసి ఏడు రోజుల్లో పోలీస్‌ దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. అంటే కేసు నమోదు చేసిన 21 రోజుల్లోనే దోషికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
► మహిళలను మాటలు, చేతల ద్వారా అవమానపర్చటం, సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వేధించడం, సోషల్‌ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టడం, అవాంఛిత సందేశాలు పంపడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ కేసులో మొదటిసారి తప్పుచేసిన మృగాళ్లకు రెండేళ్లు జైలుశిక్ష, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుతోపాటు జరిమానా తప్పదు. 
► బాలలపై లైంగిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా. 
► పోలీసులు, సాయుధ బలగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జైలు అధికారులు, సంరక్షణాధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బంది వంటి వారు ఆయా ప్రాంగణాల్లో బాలలపై అకృత్యాలకు పాల్పడితే  తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఇందుకు 14 ఏళ్లకు తక్కువ కాకుండా జీవితకాల కారాగార శిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

అత్యవసర ఫోన్‌ నంబర్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలు, మహిళలు అత్యవసర రక్షణ సేవలను పొందేలా ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్లను ప్రదర్శిస్తున్నారు. పోలీస్‌ సేవలకు డయల్‌ 100, ఫైర్‌ సర్వీసెస్‌ 101, అంబులెన్స్‌ డయల్‌ 108, అత్యవసర సేవ 112, ఉమన్‌ హెల్ప్‌లైన్‌ 181, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, సైబర్‌ మిత్ర 91212 11100, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర లైన్‌ డయల్‌ 1073, టూరిస్ట్‌ హెల్ప్‌లైన్‌ 1363 వంటి నంబర్లపై అందరికీ అవగాహన కల్పించి వారు వాటిని నమోదు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా సిద్ధం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top