breaking news
Womens Protection Act
-
మృగాళ్లకు మరణ శాసనం
సాక్షి, అమరావతి: బాలికలు, మహిళలను వేధింపులకు గురిచేసే మృగాళ్లకు మరణ శాసనం తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం ఇప్పటికే దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ల్యాబ్ వంటి అనేక పటిష్టమైన చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. దిశ బిల్లు అనంతరం మృగాళ్లపై తీసుకుంటున్న కఠిన చర్యలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంతోపాటు మహిళలను చైతన్యవంతం చేసేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసింది. అవగాహన కల్పిస్తున్న అంశాలివే.. ► మహిళలు, బాలికల తక్షణ రక్షణ కోసం, వారిపై అకృత్యాలకు పాల్పడిన మృగాళ్లకు శిక్ష పడేలా వేగవంతమైన చర్యల కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మకంగా దిశ బిల్లు–2019 తీసుకొచ్చింది. ► ఇందుకోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ల్యాబ్‌లు, కోర్డులు వంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ► బాలలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లపై కేసు నమోదు చేసి ఏడు రోజుల్లో పోలీస్ దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ విచారణ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. అంటే కేసు నమోదు చేసిన 21 రోజుల్లోనే దోషికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ► మహిళలను మాటలు, చేతల ద్వారా అవమానపర్చటం, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా వేధించడం, సోషల్ మీడియాలో అవమానకరంగా పోస్టులు పెట్టడం, అవాంఛిత సందేశాలు పంపడం, వేధింపులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ కేసులో మొదటిసారి తప్పుచేసిన మృగాళ్లకు రెండేళ్లు జైలుశిక్ష, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుతోపాటు జరిమానా తప్పదు. ► బాలలపై లైంగిక దాడికి పాల్పడిన మృగాళ్లకు ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా. ► పోలీసులు, సాయుధ బలగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జైలు అధికారులు, సంరక్షణాధికారులు, ఆస్పత్రుల యాజమాన్యాలు, సిబ్బంది వంటి వారు ఆయా ప్రాంగణాల్లో బాలలపై అకృత్యాలకు పాల్పడితే తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఇందుకు 14 ఏళ్లకు తక్కువ కాకుండా జీవితకాల కారాగార శిక్షతోపాటు జరిమానా కూడా విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అత్యవసర ఫోన్ నంబర్లు అంగన్వాడీ కేంద్రాల్లో బాలలు, మహిళలు అత్యవసర రక్షణ సేవలను పొందేలా ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ప్రదర్శిస్తున్నారు. పోలీస్ సేవలకు డయల్ 100, ఫైర్ సర్వీసెస్ 101, అంబులెన్స్ డయల్ 108, అత్యవసర సేవ 112, ఉమన్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ మిత్ర 91212 11100, రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర లైన్ డయల్ 1073, టూరిస్ట్ హెల్ప్‌లైన్ 1363 వంటి నంబర్లపై అందరికీ అవగాహన కల్పించి వారు వాటిని నమోదు చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా సిద్ధం చేస్తున్నారు. -
మహిళల భద్రతపై 28న నివేదిక
► త్వరలో స్వల్పకాలిక చర్యలు ► {పత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ► మహిళా సంఘాల నుంచి సలహాల స్వీకరణ ► అధ్యయన కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య హైదరాబాద్: మహిళల భద్రత విషయంలో స్వల్పకాలిక చర్యలను సిఫారసు చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేస్తామని మహిళల రక్షణ చట్టాలపై ఏర్పాటైన అధ్యయన కమిటీ చైర్పర్సన్, సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య తెలిపారు. సమగ్ర నివేదిక కోసం మరింత సమయం అవసరమన్నారు. కమిటీ కన్వీనర్ సునీల్ శర్మ, సభ్యులు సౌమ్యామిశ్రా, స్వాతి లక్రా, చారుసిన్హా, శైలజా రామయ్యర్, ఆమ్రపాలి, స్మితా సబర్వాల్లతో కలసి ఆమె గురువారం సచివాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల మహిళా ప్రతినిధులతో సమావేశమై సూచనలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం బేగంపేటలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు.మురికివాడల్లోని నిరుపేద మహిళలు, కాలనీల్లోని మధ్యతరగతి మహిళలను సైతం కలుసుకుని సూచనలు స్వీకరిస్తామన్నారు. పీఓడబ్ల్యూ తెలంగాణ అధ్యక్షురాలు సంధ్య, భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకులు కొండవీటి సత్యవతి, అనూరాధ, సునీతా కృష్ణన్, తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సూచనలు... ► కేసుల సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ► పోలీసుస్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులు.. మూడు అంకెల నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. ► పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ► అత్యాచార బాధితులకు సత్వర సహాయం అందడం లేదు. చట్టంలో సూచించిన విధంగా సంబంధిత శాఖలు వేగంగా స్పందించి బాధితులకు వైద్య, న్యాయ సహాయం అందించేలా చూడాలి. ► మహిళలు పనిచేసే స్థలాలు, పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక హింస నిర్మూలనపై కమిటీలు ఏర్పాటు చేయాలి ► భర్తలు వలస వెళ్లడంతో ఒంటరిగా ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి ► వీధి బాలికలు, నిరాశ్రయులైన మహిళల కోసం నైట్ షెల్టర్లను నెలకొల్పాలి. ► బాలలపై లైంగిక హింసపై అవగాహనను పాఠ్యాంశంగా చేర్చాలి. ► అనాథ బాలబాలికలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందజేయాలి.