కొత్త రెవెన్యూ డివిజన్‌: కొత్తపేటకు పచ్చజెండా

Cabinet Approves Formation Of Kothapet As Revenue Division - Sakshi

కొత్తపేట(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాలోని మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డికు అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లు ఉండగా కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం నిర్ణయించింది.

చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్‌ కీలక ఆదేశాలు

దీంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అధికార వైఎస్సార్‌ సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు. కొత్తపేటలో ఆర్‌డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే, అమలాపురం ఆర్‌డీఓ వసంతరాయుడు కలిసి 31న పలు భవనాలను పరిశీలించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ఎంవీఎస్‌ సుబ్బరాజు కల్యాణ మంటపం అనువైనదిగా నిర్ణయించారు. వెనువెంటనే ఆ భవనానికి ‘రెవెన్యూ డివిజనల్‌ అధికారి మరియు సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ కార్యాలయం, కొత్తపేట, కోనసీమ జిల్లా’ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు.

అయితే సాంకేతిక కారణాలతో కొత్తపేట డివిజన్‌ ప్రస్తావన లేకుండా అమలాపురం, రామచంద్రపురం డివిజన్‌లతోనే ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతవరకూ అమలాపురం డివిజన్‌లో ఉన్న కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాలతో పాటు రాజమహేంద్రవరం డివిజన్‌లో ఉన్న ఆలమూరు మండలాన్ని రామచంద్రపురం డివిజన్‌లో కలుపుతూ ఈ నెల 3న గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. దీంతో సుబ్బరాజు కల్యాణ మంటపానికి ఏర్పాటు చేసిన ‘కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ బోర్డు’ కూడా తొలగించారు. 

ఇదీ.. రెవెన్యూ డివిజన్‌ పరిధి 
కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి..
గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన రోజు ఉదయమే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. డివిజన్‌ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా కలిశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై హామీ పొందారు. చివరకు జగ్గిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రజల ఆకాంక్ష నెరవేరింది 
కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పూర్వపు తాలూకా, పంచాయతీ సమితి కేంద్రంగా ఒక వైభవం, వెలుగు వెలిగిన కొత్తపేటకు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో పునర్వైభవం వస్తుంది. నేను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించాను. ఇందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు క్యాబినెట్‌లో ఆమోద ముద్ర వేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. 
– చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కొత్తపేట  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top