
మాడుగుల: చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో పథకానికో పేరు పెట్టి పేద ప్రజలను దోచుకున్న నీచ చరిత్ర టీడీపీ నేతలదని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దుయ్యబట్టారు. ఆయన శనివారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థపై మాట్లాడే హక్కు అయ్యన్నపాత్రుడికి లేదని అన్నారు.
జన్మభూమి కమిటీల పేరిట సర్పంచ్‌లు, ఎంపీటీసీల హక్కులను కాలరాసి, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా.. అని ప్రశ్నించారు. మద్యం డిస్టలరీలకు లైసెన్స్‌ల జారీలో కోట్లాది రూపా యలు దోచుకున్నది టీడీపీ నేతలేనని, దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు లైసెన్స్‌లు మంజూరు చేశారని ఆరోపించారు.
సీఎం వైఎస్ జగన్ రాజకీ యాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో ప్రజల చెంతకే పాలనను అందిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. టీడీపీ దోపిడీ, అరాచకాలను భరించలేక ప్రజలు 2019 ఎన్నికల్లో ఆ పార్టీని, నర్సీపట్నంలో అయ్యన్నను చిత్తుగా ఓడించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని గుర్తించే టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రావాలని అయ్యన్నకు సవాల్ విసిరారు.