ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప | Sakshi
Sakshi News home page

ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప

Published Sun, Aug 27 2023 3:44 AM

Bokku Sora fish is the first in line of endangered species - Sakshi

సాక్షిప్రతినిధి, కాకినాడ:  సముద్ర కాలుష్య నివారణ­లో కీలకపాత్ర పోషించే బొక్కు సొర చేప కాలక్రమేణా ఉనికిని కోల్పోతోంది. వేల్‌ షార్క్‌గా పిలిచే ఈ చే­ప ‘రిన్‌ కో డాంటిడే’ జాతికి చెందింది. ఏళ్ల సంవ­త్సరా­ల కిందట డైనోసార్‌లతో సముద్ర జలాల్లో చె­ట్టాపట్టాలేసుకుని తిరిగిన అతి ప్రాచీన సముద్ర జీవి­గా ప్రసిద్ధి. 65 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సా­దు జీవి మనుగడ కోసం ప్రస్తుతం పోరాడుతోంది.

ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా 20వేల వరకు ఉండగా ప్రస్తుతం 10 వేలకు తగ్గిపోయనట్లు ‘ఐయూసీఎన్‌( ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) తన నివేదికలో పేర్కొంది. అలాగే తన నివేదికలో ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా  రెడ్‌బుక్‌లో పేర్కొంది. 

నిశ్శబ్ద జలాల్లోనే నివాసం.. 
ఈ చేపలు నిశ్శబ్దంగా ఉండే సముద్ర జలాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎప్పుడైన ఓడలు, బోట్లు ఫ్యాన్‌­లు తగిలితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. చూస్తే భయంతో వణికిపోయేలా భారీ ఆకా­రంతో తిమింగలానికి నాలుగు రెట్లు అధికంగా ఉండే వేల్‌ షార్క్‌(»ొక్కు సొర) ఎవరికీ ఏ హాని తలపెట్టదు.

ఈ చేపలు 13 మీటర్లు(42 అడుగులు) పొడ­వు, 20 నుంచి 25 మెట్రిక్‌ టన్నుల బరువుతో భారీ ఆకారంతో ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా వేల్‌షార్క్‌కు పేరుంది. తీరం నుంచి 50 నుంచి 60 కిలో మీటర్లు (డీప్‌సీ)దూరంలో సముద్రంలో సుమారు ఐదు  కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయి. సముద్ర ఉపరితలంపై ఎక్కడా కనిపించవు. లోతు జలాల్లో ఉండే అరుదైన జలచరం ఇది.  

రెండేళ్ల కిందట విశాఖలో ప్రత్యక్షం 
ఈ చేప చమురు, మాంసం, రెక్కలు, అంతర్జాతీయంగా వాణిజ్య విలువలతో మంచి డిమాండ్‌ ఉంది. ఉష్ణ మండలం, సమశీతోష్ణ సముద్ర జలాల్లో కని­పిస్తుంటాయి. సేనిగల్‌ నుంచి గునియా, న్యూ­యా­ర్క్‌ నుంచి కరేబియన్, మెక్సికో నుంచి టోంగా, తూ­ర్పు ఆఫ్రికా నుంచి థాయిలాండ్, ఎర్ర సముద్రం, యూఎస్‌ఏ, అరేబియన్, గల్ఫ్, జపాన్, ఆ్రస్టేలి­యా, బ్రెజిల్, పిలిపీన్స్‌ సముద్ర జలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి.

దేశంలో గుజరాత్, తమిళనా­డు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని విశాఖ, నె­ల్లూ­రు, ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ కుంభాభిషే­కం, భైరవపాలెం తదితర తీరప్రాంతాల్లో వేట సమయంలో సముద్రంలో మత్స్యకారులకు కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట విశాఖబీచ్‌కు వచ్చిన బొక్కు సొరను రక్షించి తిరిగి సముద్రంలో విడిచిపెట్టారు.  

వేల్‌షార్క్‌ సంరక్షణపై అవగాహన.. 
గతంలో ఈ చేపలను చూసి భయంతో వేటకు వెళ్లే మత్స్యకా­రు­లు చంపేసేవారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం కల్పిస్తోన్న అవగాహనతో తీర ప్రాంతంలో కొంతవరకు సత్ఫలితాలన్నిస్తున్నాయి. తూర్పు తీరంలో పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వేల్‌షార్క్‌ సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా తూర్పు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తోంది.

నేరుగా పిల్లలను పెట్టే ఒకే ఒక చేప..
దక్షిణాఫ్రికా తీరంలో మొట్టమొదటిసారి ఈ తిమింగ­లం సొరను డాక్టర్‌ ఆండ్రూ స్మిత్‌ గుర్తించాడు. 70 నుంచి 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ చేప­లు  లైంగిక పరిపక్వతకు రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సహజంగా చేపలన్నీ గుడ్లు పెట్టి చేప పిల్ల­లుగా రూపాంతరం చెందుతాయి.

కానీ బొక్కు సొర మాత్రం నేరుగా పిల్లలను పెడుతుంది. అదీ కూడా రెండు, మూడు చేప పిల్లలను మాత్రమే పెట్టడం ప్రత్యేకం. ఇది గుడ్లు పెట్టినా బయటకు రిలీజ్‌ చేయదు. తన అంతర్భాగంలోనే దాచుకుంటుంది. ఒకేసారి 200–­300 గుడ్లు వరకు పెడుతుంది. 2–3 ఏళ్ల అనంతరం నేరుగా పిల్లల రూపంలో బయటకు వదులుతుంది.  
     
ప్లైటో ప్లాంటాన్స్‌ అనే మొక్కలే ఆహారం.
సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చేపలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లైటో ప్లాంటాన్స్‌(సృష్టిలో మొదటిగా వచ్చాయి) అనే  మొక్కలను పోలిన జీవుల­ను ఆహారంగా తీసుకుంటాయి. ప్లైటో ప్లాంటాన్స్‌ ఎ­క్కు­వగా పెరిగితే సముద్రంలో పైకి తెట్టులా పెరిగి­పో­­యి ఆక్సిజన్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఈ బొక్కు సొర దానిని తినడం వల్ల సముద్రంలో ప్లైటో ప్లాంటాన్స్‌ పెరగకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సముద్రంలోని సూక్ష్మ మృత జీవరాశులు, సముద్రకాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. 

పులులతో సమాన హోదా... 
వన్యప్రాణి పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బొక్కు సొర చేపను పరిరక్షిస్తున్నాం. గత కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో ఉండే పులులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే ప్రాధాన్యం బొక్కు సొరకు ఇస్తున్నాం. బొక్కు సొరను చంపినా, శరీర భాగాలను విక్రయించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్‌ 50, 51 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తాం.  – ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వన్యప్రాణి విభాగం

Advertisement
Advertisement