breaking news
whale shark
-
ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప
సాక్షిప్రతినిధి, కాకినాడ: సముద్ర కాలుష్య నివారణలో కీలకపాత్ర పోషించే బొక్కు సొర చేప కాలక్రమేణా ఉనికిని కోల్పోతోంది. వేల్ షార్క్‌గా పిలిచే ఈ చేప ‘రిన్ కో డాంటిడే’ జాతికి చెందింది. ఏళ్ల సంవత్సరాల కిందట డైనోసార్లతో సముద్ర జలాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అతి ప్రాచీన సముద్ర జీవిగా ప్రసిద్ధి. 65 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాదు జీవి మనుగడ కోసం ప్రస్తుతం పోరాడుతోంది. ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా 20వేల వరకు ఉండగా ప్రస్తుతం 10 వేలకు తగ్గిపోయనట్లు ‘ఐయూసీఎన్( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన నివేదికలో పేర్కొంది. అలాగే తన నివేదికలో ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా రెడ్‌బుక్‌లో పేర్కొంది. నిశ్శబ్ద జలాల్లోనే నివాసం.. ఈ చేపలు నిశ్శబ్దంగా ఉండే సముద్ర జలాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎప్పుడైన ఓడలు, బోట్లు ఫ్యాన్లు తగిలితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. చూస్తే భయంతో వణికిపోయేలా భారీ ఆకారంతో తిమింగలానికి నాలుగు రెట్లు అధికంగా ఉండే వేల్ షార్క్(»ొక్కు సొర) ఎవరికీ ఏ హాని తలపెట్టదు. ఈ చేపలు 13 మీటర్లు(42 అడుగులు) పొడవు, 20 నుంచి 25 మెట్రిక్ టన్నుల బరువుతో భారీ ఆకారంతో ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా వేల్షార్క్కు పేరుంది. తీరం నుంచి 50 నుంచి 60 కిలో మీటర్లు (డీప్సీ)దూరంలో సముద్రంలో సుమారు ఐదు కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయి. సముద్ర ఉపరితలంపై ఎక్కడా కనిపించవు. లోతు జలాల్లో ఉండే అరుదైన జలచరం ఇది. రెండేళ్ల కిందట విశాఖలో ప్రత్యక్షం ఈ చేప చమురు, మాంసం, రెక్కలు, అంతర్జాతీయంగా వాణిజ్య విలువలతో మంచి డిమాండ్ ఉంది. ఉష్ణ మండలం, సమశీతోష్ణ సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. సేనిగల్ నుంచి గునియా, న్యూయార్క్ నుంచి కరేబియన్, మెక్సికో నుంచి టోంగా, తూర్పు ఆఫ్రికా నుంచి థాయిలాండ్, ఎర్ర సముద్రం, యూఎస్ఏ, అరేబియన్, గల్ఫ్, జపాన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, పిలిపీన్స్ సముద్ర జలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దేశంలో గుజరాత్, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ కుంభాభిషేకం, భైరవపాలెం తదితర తీరప్రాంతాల్లో వేట సమయంలో సముద్రంలో మత్స్యకారులకు కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట విశాఖబీచ్కు వచ్చిన బొక్కు సొరను రక్షించి తిరిగి సముద్రంలో విడిచిపెట్టారు. వేల్‌షార్క్ సంరక్షణపై అవగాహన.. గతంలో ఈ చేపలను చూసి భయంతో వేటకు వెళ్లే మత్స్యకారులు చంపేసేవారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం కల్పిస్తోన్న అవగాహనతో తీర ప్రాంతంలో కొంతవరకు సత్ఫలితాలన్నిస్తున్నాయి. తూర్పు తీరంలో పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వేల్‌షార్క్ సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా తూర్పు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. నేరుగా పిల్లలను పెట్టే ఒకే ఒక చేప.. దక్షిణాఫ్రికా తీరంలో మొట్టమొదటిసారి ఈ తిమింగలం సొరను డాక్టర్ ఆండ్రూ స్మిత్ గుర్తించాడు. 70 నుంచి 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ చేపలు లైంగిక పరిపక్వతకు రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సహజంగా చేపలన్నీ గుడ్లు పెట్టి చేప పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కానీ బొక్కు సొర మాత్రం నేరుగా పిల్లలను పెడుతుంది. అదీ కూడా రెండు, మూడు చేప పిల్లలను మాత్రమే పెట్టడం ప్రత్యేకం. ఇది గుడ్లు పెట్టినా బయటకు రిలీజ్ చేయదు. తన అంతర్భాగంలోనే దాచుకుంటుంది. ఒకేసారి 200–300 గుడ్లు వరకు పెడుతుంది. 2–3 ఏళ్ల అనంతరం నేరుగా పిల్లల రూపంలో బయటకు వదులుతుంది. ప్లైటో ప్లాంటాన్స్ అనే మొక్కలే ఆహారం. సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చేపలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లైటో ప్లాంటాన్స్(సృష్టిలో మొదటిగా వచ్చాయి) అనే మొక్కలను పోలిన జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ప్లైటో ప్లాంటాన్స్ ఎక్కువగా పెరిగితే సముద్రంలో పైకి తెట్టులా పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ బొక్కు సొర దానిని తినడం వల్ల సముద్రంలో ప్లైటో ప్లాంటాన్స్ పెరగకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సముద్రంలోని సూక్ష్మ మృత జీవరాశులు, సముద్రకాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. పులులతో సమాన హోదా... వన్యప్రాణి పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బొక్కు సొర చేపను పరిరక్షిస్తున్నాం. గత కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో ఉండే పులులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే ప్రాధాన్యం బొక్కు సొరకు ఇస్తున్నాం. బొక్కు సొరను చంపినా, శరీర భాగాలను విక్రయించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 50, 51 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వన్యప్రాణి విభాగం -
‘వేల్’లల్లో ఒకసారి..
కిందన అంతోటి సైజున్న వేల్ షార్క్.. పైన ఇంతే ఉన్న చిన్నపాటి బోటు.. వేల్ షార్క్ జస్ట్ అలా బుర్రెత్తి పైకి చూస్తే.. బోటు పని అంతే ఉన్నట్లు కనిపిస్తున్న ఈ సూపర్ చిత్రాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ టామ్ కేనన్ తీశారు. ఈ ఫొటోను పశ్చిమ ఆస్ట్రేలియాలోని నింగలూ రీఫ్ ప్రాంతంలో క్లిక్‌మనిపించారు. వేల్‌షార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద చేప. అసలు కింద ఈ భారీ తిమింగలం ఉందన్న సంగతి బోటులోని వాళ్లకు తెలియదని.. వేల్‌షార్క్ కొంచెం ముందుకు వెళ్లాక దాన్ని చూసి.. ఆనందాశ్చర్యాలకు లోనయ్యారని టామ్ తెలిపారు. సాధారణంగా ఇవి లోతైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని.. ఇలా రావడం అరుదుగా జరుగుతుంటుందని చెప్పారు. సముద్రపు లోతుల్లో తాము చాలా చిత్రాలు తీస్తుంటామని.. ఇలాంటి ఫొటోతీయడం వేలల్లో ఒకసారి మాత్రమే జరుగుతుందని టామ్ అన్నారు. -
తిమింగలాన్ని చంపిన ప్లాస్టిక్ స్పూన్..
చెన్నై: పాంబన్ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం మృతదేహాన్ని కోసి చూసిన జాలర్లు దాని పొట్టలో కనిపించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. రామేశ్వరం సమీపంలోని సముద్ర తీరంలో గురువారం సాయంత్రం 18 అడుగుల నాలుగు టన్నుల బరువు గల భారీ తిమింగలం మృతి చెంది ఒడ్డుకు చేరింది. దానిని కోసి అటవీ శాఖ, వెటర్నటీ వైద్యులు పరీక్షలు జరిపారు. పొట్టలో పేగుల మధ్య ప్లాస్టిక్ స్పూన్ ఇరుక్కుంది. ఈ కారణంగానే తిమింగలం మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అనంతరం దాన్ని జేసీబీతో సముద్ర తీరంలో పెద్ద గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ముఖ్యంగా సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లే భోజన పదార్థాలు తిని, అనంతరం వాటిని సముద్రంలోకి విసిరి వేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు వంటివి విసిరివేయడం చేస్తున్నారు. వాటిని ఆహారంగా తీసుకున్న సముద్ర చరాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు, వాటిని తినే ప్రజలకు పలు రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను సముద్రంలోకి విసర వద్దని జాలర్లకు వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ముక్కలుగా కోసి కిలోల లెక్కన అమ్మేసారు!
అరుదైన తిమింగలం సొరచేప(వేల్ షార్క్)ను వేటాడి చంపినందుకు ఇద్దరు మత్స్యకారులను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్నేయ చైనాలో గ్వాంగ్జీ ప్రావిన్స్ లోని బీహయ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆన్ లైన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు స్పందించారు. అంతరించిపోతున్న వేల్ షార్క్ ను వేటాడినందుకు లియొ, హునాగ్ అనే ఇంటి పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు సొరచేప వేటాడి, దాని ముక్కలుగా చేసి కిలో రూ. 375కు అమ్మినట్టు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది. చచ్చిపోయిన భారీ సొరచేపను క్రేన్ సహాయంతో ట్రాలీలోకి ఎక్కించి, తరలిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. మనిషి దురాశకు అమాయక జలచరం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరుదైన భారీ సొరచేపను వేటాడి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అయితే సముద్రంతో చచ్చిపడున్న సొరచేపనే తాము బయటకు తీశామని పోలీసులతో నిందితులు చెప్పారు. వేల్ షార్క్ ను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది. దీనిని వేటాడడాన్ని నిషేధించింది. పొరపాటున వలలో చిక్కినా వదిలివేయాలి.